ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము

June 22, 2022


img

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము (64) పేరును ఖరారు చేసినట్లు బిజెపి ప్రకటించింది. ఆమె ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన బైడపోసిలో ఓ గిరిజన తెగలో 1958లో జన్మించారు. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఆ పరిస్థితులకు ఎదురీదుతూ భువనేశ్వర్‌లో రమాదేవి విమెన్స్ కాలేజీలో బీఏ చేశారు. ఆ తరువాత శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ లో హానరరీ టీచరుగా కొంతకాలం పనిచేసిన తరువాత ఒడిశా రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్‌ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వోద్యోగం సంపాదించారు. 

1997లో బిజెపిలో చేరాలనే ఆమె నిర్ణయం భవిష్యత్‌లో ఈ స్థాయికి చేర్చుతుందని బహుశః ఆమె కూడా ఊహించి ఉండరు. ఆమె రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా, వెంటనే వైస్ ఛైర పర్సన్‌గా ఎన్నికవడంతో ఆమె రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత 2000 సంవత్సరంలో రాయ్‌రంగాపూర్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరంలో ఒడిశాలో బిజెపి-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానిలో ద్రౌపది ముర్ము రవాణా, వాణిజ్య, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రిగా పనిచేశారు. 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టబోతున్నారు. 

ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. కొన్నేళ్ళ క్రితం ఆయన చనిపోయారు. ముర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలుగగా ఇద్దరు కుమారులు మరణించారు. కుమార్తె పేరు ఇతిశ్రీ ముర్ము.       

ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనప్రయమే అని చెప్పవచ్చు. ఎన్డీయే కూటమికి 49 శాతం ఓట్లు ఉండగా మరో 1.1 శాతం బయట పార్టీల మద్దతు అవసరం ఉంది. అంతకంటే చాలా ఎక్కువ ఓట్లు శాతం కలిగిన ఏపీలోని వైసీపీ, ఆమె ఒడిశాకు చెందినవారు కనుక ఆ రాష్ట్రంలోని అధికార బిజెడి మద్దతు ఇవ్వడం ఖాయం. ఈ రెండు పార్టీలు కాకుండా ఇంకా అన్నాడీఎంకె వంటి పలు పార్టీలు ఆమెకే ఓట్లు వేయడం ఖాయమే. కనుక భారత్‌కు తొలి ఆదివాసీ, గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం కూడా ఖాయమే. Related Post