చంచల్‌గూడ జైలులో పిల్లలు... విలపిస్తున్న తల్లితండ్రులు

June 21, 2022


img

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడులలో పోలీసులు 45 మంది యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌పై చంచల్‌గూడ జైలులో ఉంచారు. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్లలో ఆ వార్తలు చూసి తల్లడిల్లిపోయిన వారి తల్లితండ్రులు చంచల్‌గూడ జైలుకి వస్తున్నారు. అక్కడ జైలులో తమ పిల్లలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలు ఆర్మీలో చేరాలని ఎంతగానో శ్రమిస్తున్నారని, వారికి ఆ ఉద్యోగాలు సాధించాలనే తపన తప్ప ఎవరికీ హాని తలపెట్టాలని, రైళ్లు తగలబెట్టాలనే దురాలోచనలు లేవని చెపుతున్నారు. ఇంత చిన్న వయసులో పిల్లలపై కేసులు నమోదు చేసి  జైల్లో పెడితే వారి భవిష్యత్‌ నాశనం అవుతుందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల వ్యవహారం జైలు అధికారుల చేతిలో ఉండవని తెలియని తల్లితండ్రులు తమ పిల్లలను దయచేసి విడిచిపెట్టాలని జైలు సిబ్బందిని కన్నీళ్ళతో వేడుకొంటుంటే వారు సైతం బాధపడుతున్నారు. 

ఈ అల్లర్లలో వరంగల్‌ జిల్లాలోని ఖానాపూర్ మండలం డబీర్ పేటకు చెందిన దామెర రాకేష్ (22) అనే యువకుడు చనిపోయినప్పుడు సిఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి అతని కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సాయం, వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించారు. అంటే ఈ అల్లర్లలో చనిపోయిన రాకేష్‌ను ప్రభుత్వం క్షమించగలిగినప్పుడు, జైలులో ఉన్న మిగిలిన పిల్లలను కూడా క్షమించి వారిని ఆ కేసుల నుంచి విముక్తి కల్పించగలిగితే అందరూ హర్షిస్తారు.

దీని కోసం సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీతో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో మాట్లాడి జైలు పాలైన పిల్లలను కాపాడగలిగితే వారికి పునర్జన్మ ప్రసాధించినట్లే అవుతుంది. కేంద్రప్రభుత్వం కూడా దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో అరెస్ట్ చేసిన నిరుద్యోగ యువతకు విముక్తి ప్రసాదించడం ద్వారా యువతను పెడమార్గంలో ప్రయాణిస్తే ఏమవుతుందో తెలియజేసి క్షమాభిక్ష పెట్టినట్లు అవుతుంది. కనుక మళ్ళీ ఎన్నడూ వారు ఇటువంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో ప్రయాణిస్తారు.  


Related Post