టిఆర్ఎస్ పార్టీలో క్రమంగా అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“నేను 1981లోనే సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాను. అప్పటి నుంచి రాజకీయాలలో ఉన్న నాకు మంత్రి కేటీఆర్ జూనియరే అవుతారు. తుమ్మల నాగేశ్వర రావు తన సొంతూరు గండుగులపల్లిలోనే ఓట్లు వేయించలేకపోయారు. అటువంటి అసమర్ద రాజకీయ నాయకుడు కూడా నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడు. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. కానీ ఆయన మాటలను ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.
ఈనెల 18న ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డిల కృతజ్ఞత సభలో నన్ను అవమానించారు. ఫ్లెక్సీ బ్యానరులో అందరి ఫోటోలు వేసారు కానీ నాది వేయలేదు. పార్టీలో ఈవిదంగా అవమానాలు ఎదురవుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను.
ఈ 8 ఏళ్ళ కేసీఆర్ పాలనలో పార్టీలో గిరిజన ప్రతిధులకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ఏనాడూ సముచిత గౌరవం లభించలేదు. కనుక ఇకనైనా పార్టీ అధిష్టానం తక్షణం స్పందించకపోతే నేను పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతాను,” అని హెచ్చరించారు.
తాటి వెంకటేశ్వర్లు పార్టీలోనే ఉంటూ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గురించి ఈవిదంగా మాట్లాడారంటే ఆయన మూటాముల్లె సర్దుకొని బయటకు వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నారనే అర్దం. పార్టీ చేతే బహిష్కరణ వేటు వేయించుకొని బయటపడేందుకే ఈవిదంగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. ఆయన కోరిక త్వరలోనే తీరవచ్చు.