ఈసారి రాష్ట్రపతి ఎన్నికలలో ఓ విచిత్రమైన సన్నివేశం చూడబోతున్నాము. ఎన్డీయే అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని నిలబెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఈరోజు మధ్యాహ్నం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఢిల్లీలో వెంకయ్యనాయుడిని కలిసి సుదీర్గంగా చర్చించారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ కార్యవర్గ సమావేశంలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ఇక బిజెపికి పోటీగా కాంగ్రెస్ మిత్రపక్షాలు తరపున పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా అంగీకరించారు. గతంలో ఆయన బిజెపిలోనే ఉండేవారు. ఆయన అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు నేడు పార్లమెంటు అనుబంద భవనంలో సమావేశమయ్యి చర్చిస్తున్నాయి. కనుక ఈరోజు సాయంత్రం లేదా రేపటికి ఎన్డీయే, యూపీయేల రాష్ట్రపతి అభ్యర్ధుల పేర్లు ఖరారాయే అవకాశం ఉంది.
ఒకవేళ వారిద్దరి పేర్లు ఖరారు చేసినట్లయితే, ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బిజెపి అభ్యర్ధికి మాజీ బిజెపి అభ్యర్ధికి మద్య పోటీ జరుగవచ్చు. అయితే ఈ ఎన్నికకు అవసరమైన ఎలక్ట్రోల్ ఓట్లు ఎన్డీయేకే ఎక్కువ ఉన్నాయి. కనుక ఎన్డీయే అభ్యర్ధి గెలుపు లాంఛన ప్రాయమే. కనుక ఆయన చేతిలో యశ్వంత్ సిన్హా ఓటమి కూడా ముందే ఖాయం అయినట్లే.