ఈ ప్రశ్న అడిగింది వికారాబాద్ జిల్లాలో ఓ సామాన్య పౌరుడు. ఎందుకంటే చుట్టూ ఎత్తైన ప్రాంతాలు ఉండి వర్షం పడితే ఆ నీళ్ళు కిందకు పారి నిలిచేచోట ఎవరైనా అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మిస్తారా?అని అడిగారు. ఆయన ప్రశ్నకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో ఇంజనీర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, హైదరాబాద్, బోరబండకు చెందిన ఓ పెళ్ళివారు బస్సు మాట్లాడుకొని వికారాబాద్ బయలుదేరారు. దారిలో కోటపల్లి మండలంలోని బర్వాద్ గ్రామం వద్ద మూడేళ్ళ క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి కింద వరద నీటిలో నిన్న రాత్రి ఆ బస్సు చిక్కుకుపోయింది. గ్రామస్తుల సాయంతో బస్సులోని పెళ్ళివారందరూ క్షేమంగా బయటపడ్డారు. కానీ తెల్లారేసరికి వరద ప్రవాహం పెరగడంతో బస్సు పూర్తిగా మునిగిపోయింది. బస్సులో ఉన్న వారి పెళ్ళి సామాను, బట్టలు అన్ని నీళ్ళలో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ గ్రామస్తుడు మీడియాతో మాట్లాడుతూ, “చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదే ప్రధానమైన రహదారి. దీనిని నిర్మించినప్పటి నుంచే మాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇదివరకు రైల్వే గేటు ఉన్నప్పుడు, ఇటువంటి సమస్య ఎన్నడూ రాలేదు. ఈ బ్రిడ్జి కింద రోడ్డు నిర్మించినప్పటి నుంచి అనేకసార్లు బస్సులు, ట్రాక్టర్లు, ఆటో రిక్షాలు నీళ్ళలో మునిగి పాడైపోతూనే ఉన్నాయి. నీళ్ళు నిలిచేచోట బుద్దున్నవాడు ఎవడైనా కాలువ తవ్వి రోడ్డు నిర్మిస్తాడా?పోనీ ఆ రోడ్డు పనులనైనా పూర్తి చేశారా...అంటే అదీ లేదు. ఏమంటే మీ ఎమ్మెల్యేని అడగండి... జిల్లా కలెక్టర్‌ను అడగండి... మాకు తెలీదని కాంట్రాక్టర్ తప్పించుకొనిపోతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి,” అని అన్నాడు.