సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 56 మందిని నిందితులుగా గుర్తించి వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డికి చెందిన మలపెల్లి మధుసూధన్ (20)ని ఈ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించి ఈ కేసులో ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు.
అదే జిల్లాలో గాంధారి మండలంలోని మాతుసంగెంకు చెందిన సంతోష్ (22)ని ఏ-5గా, మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన బూక్య పెంట్య (19)ని ఏ-13గా చేర్చారు. వీరితో పాటు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్‌లకు చెందిన మరో 12 మందిని అరెస్ట్ చేసి నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో గాయపడిన నిందితులతో పాటు 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్‌పై నిందితులు ముందస్తు పధకం ప్రకారమే దాడి చేశారని ఇప్పటికే రుజువైంది. దానికి అవసరమైన సాక్ష్యాధారాలన్నీ నిందితుల మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ గ్రూపులలోనే లభించాయి. అదీగాక వారు సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు వారిలో కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి వీడియోలను దేశవ్యాప్తంగా వైరల్ చేసారు. ఇప్పుడు అవి కూడా నిందితులకు కటిన శిక్షలు పడేందుకు ప్రధాన సాక్ష్యాలుగా మారాయి.
నిందితులలో చాలా మంది రెండేళ్ల క్రితం ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారున్నారు. వారందరిపై రైల్వే మరియు ఐపిసీ చట్టాలలో 15 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులను రైల్వే పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులకు బదిలీ చేయనున్నారు.
నిందితులలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఓ పక్క కటిక దరిద్రం అనుభవిస్తూనే ఎంతో శ్రమిస్తూ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై నీళ్ళు జల్లుతూ కేంద్రం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రకటించడంతో వారందరూ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. వారి ఆవేదన ఆవేశంగా మారడమే ఈ విధ్వంసానికి కారణం అని అర్దమవుతూనే ఉంది. వారి ఆవేదన, ఆవేశాలే వారి జీవితాలనే నాశనం చేయబోతుండటం చాలా బాధాకరం.
వారు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విధ్వంసానికి పాల్పడినప్పటికీ, దానిలో ఆవేశమే తప్ప దేశాన్ని, ప్రభుత్వాలని దెబ్బ తీయాలనే ఆలోచన లేదని అర్ధమవుతూనే ఉంది. ఒకవేళ వారు ఆర్మీ ఉద్యోగాలలో చేరి ఉంటే దేశ రక్షణ కోసం సరిహద్దులలో ఉండేవారు. కానీ క్షణికావేశం కారణంగా జైల్లో ఉన్నారు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వారి పరిస్థితిని, వారిపైనే ఆధారపడి ఉన్న నిరుపేద కుటుంబాలను, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని క్షమించి ఈ కేసుల నుంచి విముక్తి కల్పించగలిగితే మంచిది.