రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి పోటీగా దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ ఎన్నికలో ఓటమి ముందే ఖాయం అని తెలిసి ఉండటంతో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదట ఎన్సీపీ అధినేత శరత్ పవర్‌ను పోటీ చేయమని అడగగా ఆయన తిరస్కరించారు. తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లాను కోరగా ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు. తరువాత మహాత్మా గాంధీజీ మనుమడు గోపాల కృష్ణ గాంధీని పోటీ చేయమని అడగగా నేడు ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు.
“ప్రతిపక్షాల ఐక్యతను, శక్తిని చాటి చెప్పేందుకుగాను నన్ను ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయమని కోరినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో నాకంటే మెరుగైనవాళ్ళు పోటీ చేయడమే సమంజసంగా భావిస్తున్నాను. కనుక అన్ని కోణాల నుంచి లోతుగా పరిశేలించిన తరువాత నేను విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయరాదని నిర్ణయించుకొన్నాను,” అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మమతా బెనర్జీ ఎంచుకొన్న ముగ్గురు అభ్యర్ధులు పోటీ చేసేందుకు తిరస్కరించడంతో ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ పోటీ నుంచి తప్పుకొంటాయా లేదా మరో అభ్యర్ధిని ఎవరినైనా నిలబెట్టి తమ పంతం చెల్లించుకొంటాయా? అనేది రేపు లేదా ఎల్లుండి ముంబైలో జరుగబోయే తుది సమావేశంలో తెలుస్తుంది.