అగ్నిపథ్‌ దేశానికి, యువతకు మంచిదా కాదా?

June 20, 2022


img

అగ్నిపథ్‌పై ఇది దేశానికి, యువతకు మంచిదా కాదా? అనే చర్చపై రెండు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఎందుకు మంచిది కాదంటే... 

1. ఈ విధానం నిరుద్యోగ యువతకు, త్రివిద దళాలకు కూడా ఏమాత్రం మంచిది కాదు. ఒక యువతి లేదా యువకుడు నాలుగేళ్ళపాటు శిక్షణ పొందిన తరువాత పూర్తిస్థాయి సైనికుడిగా తయారవుతారు. కానీ ఆరు నెలల శిక్షణలో కేవలం రిపబ్లిక్ డే పేరేడులో మార్చింగ్ చేయడానికి మాత్రమే సరిపోతారని ఓ మాజీ సైనికాధికారి అన్నారు. నాలుగేళ్ళలో కొంత రాటు తేలే సమయానికి అతను లేదా ఆమెను బయటకు పంపించేస్తారు. కనుక దాని వలన నష్టమే తప్ప లాభం ఉండదు.  

2. మరోపక్క త్రివిద దళాలలో దీర్గకాల సర్వీసు చేసినవారు రిటైర్ అవుతుంటారు. అంత సుశిక్షితులైన సైనికుల స్థానాన్ని ఏమాత్రం అనుభవంలోలేని ఈ అగ్నివీరులతో భర్తీ చేయలేరు. శత్రుదేశంతో యుద్ధం వస్తే అప్పుడు దేశం తరపున పోరాడేందుకు సుశిక్షితులైన సైనికులే మన దగ్గర ఉండరు. ఎలాగూ నాలుగేళ్ళ తరువాత ఇంటికి పోవలసివారమే కనుక అగ్నివీరులు ఉద్యోగం పట్ల అంతా నిబద్దత చూపకపోవచ్చు. దీని వలన రక్షణ వ్యవస్థకు ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుంది. 

3. ఇక పదో క్లాస్, ఇంటర్ చదివి అగ్నిపథ్‌ ద్వారా సైన్యంలో ప్రవేశించిన యువకులు, నాలుగేళ్ళ తరువాత ఆ ఉద్యోగాలలో  బయటకు వచ్చేసరికి, వారికి చక్కటి క్రమశిక్షణ, సైనిక శిక్షణ, ఆరోగ్యం మాత్రమే ఉంటుంది తప్ప మరే నైపుణ్యం ఉండదు. అప్పటికి వారికి విద్యార్హత కూడా ఉండదు కనుక డ్రైవరు, క్లీనరు, సెక్యూరిటీగార్డు వంటి ఉద్యోగాలకు మాత్రమే లభిస్తాయి. పోలీస్ శాఖలో వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యోగాలను ఏటా భర్తీ చేయవు. ఎప్పుడు భర్తీ చేయాలనుకొన్నా వాటి కోసం లక్షలమంది నిరుద్యోగులు పోటీ పడుతుంటారు. కనుక అగ్నివీరులు బయటకు వచ్చిన తరువాత వారి జీవితాలలో అసలైన అగ్నిపరీక్షలు మొదలవవచ్చు.

4. నాలుగేళ్ళ తరువాత బయటకు వచ్చే అగ్నివీరులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతే వారు సైనికులుగా పొందిన శిక్షణతో చెడు మార్గాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దాని వలన దేశానికి, సమాజానికి ప్రమాదం కలగవచ్చు.  

అగ్నిపథ్‌ ఎందుకు మంచిదంటే... 

1. త్రివిద దళాలలో పనిచేసే లక్షలాది మంది సైనికుల జీతాలతో పాటు, పదవీ విరమణ చేసిన లక్షలాదిమందికి పింఛన్లు, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ నాలుగేళ్ళ తరువాత వెళ్లిపోయే అగ్నివీరులకు రూ.10-12 లక్షలు చేతిలో పెట్టి బయటకు పంపించేయవచ్చు. కనుక కేంద్రప్రభుత్వంపై పింఛన్ల భారం తగ్గిపోతుంది.    

2. అగ్నివీరుల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటుంది కనుక పెద్దగా చదువు, పరీక్షలు లేకపోయినా నిరుద్యోగ యువతకు ఏటా 40-45,000 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

3. వారు నాలుగేళ్ళు సాయినికులుగా పనిచేసి బయటకు  వచ్చేసరికి వారి వయ్యాసు సుమారు 21-25 ఏళ్ళ మద్య ఉంటుంది. అది జీవితంలో ప్రారంభదశ క్రిందే లెక్క. అప్పటికే సైనికుడిగా మంచి క్రమశిక్షణ, కఠోరశ్రమ చేయడం అలవాడుతుంది. మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. పదవీ విరమణ చేసేటప్పుడు సుమారు రూ.10-12 లక్షలు చేతిలో పెట్టి పంపిస్తారు. కనుక ఆ డబ్బుతో ఆ వయసులో కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది.    

4. నాలుగేళ్ళ తరువాత సర్వీసు నుంచి బయటకు పంపించివేస్తారని ముందే తెలుస్తుంది కనుక మానసికంగా సిద్దంగా ఉంటారు. కనుక సులువుగా కొత్త జీవితం ప్రారంభించి దానిలో ఇమిడిపోగలరు. 


Related Post