రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి పోటీగా బిజెపియేతర పార్టీల తరపున అభ్యర్ధిని నిలబెట్టాలనే మమతా బెనర్జీ ప్రయత్నాలు ఫలించడం లేదు. మొదట మహారాష్ట్రకు చెందిన శరత్ పవార్‌ను పోటీ చేయమని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాను పోటీ చేయమని కోరారు. కానీ ఆయన కూడా సమ్మతించలేదు. తాను కూడా రేసులో నుంచి తప్పుకొంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
“ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో చాలా క్శ్లిష్ట పరిస్థితులలో పయనిస్తోంది. ఈ సమయంలో నా సేవలు నా రాష్ట్రానికి అవసరం కనుక నేను రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయకూడదని నిర్ణయించుకొన్నాను,” అని తెలిపారు.
అయితే అసలు కారణం వేరే ఉంది. ఈ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధి విజయం సాధించడం ఖాయం. బిజెపి తన అభ్యర్ధి పేరు ప్రకటిస్తే చాలు అతను లేదా ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైపోయినట్లే. ఎందుకంటే ఎన్డీయేకి ఇప్పటికే 49.6 శాతం బలం ఉంది. మరో 1.1 శాతం అవసరం ఉండగా, అంతకంటే ఎక్కువ శాతమే బలమున్న వైసీపీ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించేందుకు సిద్దంగా ఉంది.
కనుక ప్రతిపక్షాల అభ్యర్ధిగా ఎవరు నిలబడిన వారి ఓటమి ఖాయం. అందుకే ఎవరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్, మిత్రపక్షాలకు తగినంత బలం ఉండి ఉంటే రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు కనీసం డజను మంది ముందుకు వచ్చి ఉండేవారు. ఎప్పటికైనా దేశానికి ప్రధానామంత్రి కావాలని ఆశపడుతున్న శరత్ పవార్ ఈ అవకాశాన్ని వదులుకోనేవారే కాదు.