కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, విధ్వంసం చెలరేగడం కేంద్రప్రభుత్వానికి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చని భావించింది కానీ నిరుద్యోగ యువత ఈ స్థాయిలో అగ్నివీరుల్లా మంటలు రగిలిస్తారని ఊహించలేకపోయింది.
కనుక నిన్ననే హడావుడిగా నష్టానివారణ చర్యలు చేపట్టి ఈ నియామకాల 21 ఏళ్ళ వయోపరిమితిని 23 ఏళ్ళకు పెంచింది. కానీ అగ్నివీరులు శాంతించకపోవడంతో ఇవాళ్ళ మరో తాయిలం ప్రకటించింది. నాలుగేళ్ల తరువాత పదవీ విరమణ చేసే అగ్నివీరులకు కేంద్ర సాయుధ బలగాలలో, అస్సాం రైఫిల్స్ రెజిమెంటులో 10 శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ దేశంలో పలు ప్రాంతాలలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రంగ ప్రవేశం చేసి కేంద్రంపై నిప్పులు చెరుగుతుండటంతో ఈ సమస్య మరింత జటిలమైంది. ప్రతిపక్షాలకు-బిజెపికి మద్య యుద్ధం మొదలవడంతో ఇప్పుడు దీనికి రాజకీయరంగు కూడా పులుముకొంది.
ఇప్పటివరకు నిరుద్యోగులకు మాత్రమే కేంద్రప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోవలసివస్తోంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కూడా కేంద్రం, బిజెపి యుద్దం చేయవలసివస్తోంది. మరో విదంగా చెప్పుకోవాలంటే ప్రతీ రాష్ట్రంలోను ప్రాంతీయ పార్టీలతో బిజెపి యుద్దం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ యుద్ధంలో కేంద్రప్రభుత్వమే వాటికి అగ్నిపథ్ అనే బలమైన ఆయుధం అందించింది కనుక అవి దానితోనే కేంద్రంపై దాడి చేస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్-బిజెపిలమద్య రాజకీయ ఆధిపత్యపోరు చాలా కాలంగానే సాగుతోంది. ఇప్పుడిప్పుడే బిజెపి కాస్త పైచేయి సాధిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయంతో మళ్ళీ టిఆర్ఎస్ పైచేయి సాధించగలిగే అవకాశం ఏర్పడింది.
టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే అగ్నిపథ్ ఆయుధంతో కేంద్రప్రభుత్వం, బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే కేంద్రం అగ్నిపథ్ విషయంలో వెనక్కు తగ్గాలనుకోవడం లేదు కనుక టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిజెపిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు గడువు పొడిగించినట్లు అయ్యింది. కనుక ఇక నుంచి బిజెపికి అన్ని రాష్ట్రాలలో మద్దెలదరువు తప్పదు. ఇది స్వయంకృతాపరాదమే కనుక భరించకతప్పదు.