తల్లి హీరాబెన్ నేడు 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం గుజరాత్‌లోని గాంధీనగర్ చేరుకొని, అక్కడ తన తమ్ముడు పంకజ్ మోడీ నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆమె పాదాలు కడిగి ఆ నీళ్ళను తలపై చల్లుకొని ఆమె ఆశీర్వాదం పొందారు. సుమారు అర్దగంటసేపు తల్లితో గడిపిన తరువాత మళ్ళీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన తల్లితో తీసుకొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాల్యంలో తమను పెంచడానికి తమ తల్లి ఎంతో కష్టపడిందని కానీ ఏనాడూ జీవితంలో ఓటమిని అగీకరించకుండా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడిందని మోడీ తన బ్లాగులో వ్రాసుకొన్నారు. ఆమె తన జీవితాన్ని ఓ తపస్సులా జీవించిందని, తమ కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, ఆమెలో మాతృమూర్తికి ఉండే శక్తిని కళ్ళారా చూశానని ప్రధాని నరేంద్రమోడీ తన బ్లాగులో వ్రాసుకొన్నారు. అందుకే దేశంలో మహిళలు తలుచుకొంటే సాధించలేనిది ఏమీ ఉందనిపిస్తుందని, తన తల్లి స్పూర్తితోనే తాను కూడా ముందుకు సాగుతున్నానని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
తల్లిని అమితంగా గౌరవించే ప్రధాని నరేంద్రమోడీ తన అర్దాంగిని కూడా అంతే గౌరవించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. తన తల్లి పట్ల ప్రధాని నరేంద్రమోడీ ఎంత గౌరవం చూపుతున్నారో, మోడీ అర్ధాంగి జసోదా బెన్ కూడా నేటికీ ఆయన పట్ల అంతే గౌరవంతో వ్యవహరిస్తుంటారు.
1968లో వారి పెళ్లి జరిగింది. అప్పటికి ఆమెకు 17, మోడీకి 18 ఏళ్ళే. కానీ ఆమెతో ఏనాడూ మోడీ కాపురం చేయలేదు. మన దారులు వేరని ఆయన చెప్పారని జసోదా బెన్ చెప్పారు. అప్పటి నుంచి ఆమె మళ్ళీ పెళ్లి ఆలోచన చేయకుండా ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు.
ఆమెను మోడీ తిరస్కరించినప్పటికీ ఆమె మాత్రం భర్త ఆయురారోగ్యాల కోసం నేటికీ పూజలు చేస్తూనే ఉంటారు. భర్త గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, తరువాత దేశానికి ప్రధాని నరేంద్రమోడీ అయినా ఆమె ఏనాడూ ఆయనను ఇబ్బంది పెట్టలేదు. కనీసం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. రిటైర్ అయిన తరువాత వచ్చే రూ.14,000 పింఛనుతోనే గుజరాత్‌లో రాజోసన అనే గ్రామంలో స్థిరపడి అత్యంత నిరాడంబరమైన జీవితం గడుపుతున్నారు.
మోడీ తల్లి తన పిల్లలను పెంచడానికి త్యాగాలు చేస్తే, జసోదా బెన్ తన జీవితాన్నే త్యాగం చేశారు. అటువంటి గొప్ప మహిళామూర్తిని ప్రధాని నరేంద్రమోడీ భార్యగా అంగీకరించకపోయినా, తన కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న ఆమెను గౌరవించి ఉంటే అందరూ హర్షించేవారు కదా?