నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లపై హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం చవకబారు రాజకీయమే అని చెప్పక తప్పదు. అల్లర్ల గురించి ఆయన ఏమన్నారంటే, “ఈ అల్లర్ల వెనుక రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉందని అనుమానం కలుగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా యువకులను రెచ్చగొట్టి ఈ అల్లర్లు జరిపించినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి.
మొన్న రాజ్‌భవన్ ముట్టడి వెనుక రాజకీయ పార్టీ ప్రమేయం ఉంది. ఆర్మీలో చేరాలనుకొనేవారిలో దేశభక్తి ఉంటుంది కనుక వారు ఇటువంటి విధ్వంసానికి పాల్పడరు. ఆర్మీ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న యువత ముసుగులో రాజకీయ పార్టీలకు చెందినవారు విధ్వంసం సృష్టించారు. కనుక ఈ అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర విచారణ జరిపించి వాటివెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించాలి. లేకుంటే సిబిఐ చేత దర్యాప్తు జరిపించి ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారో కనుగొంటాము.
కరోనా కారణంగా రెండేళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోయిన మాట వాస్తవమే. కనుక వీలైనంత ఎక్కువ మంది యువతకు ఆర్మీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం అగ్నిపథ్ ప్రవేశపెట్టింది. ప్రభుత్వాస్తులను కొందరు ధ్వంసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు పట్టన్నట్లు ఊరుకోవడం సరికాదు,” అని అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న యువకులు నిన్న రైల్వే పోలీసు అధికారులతో మాట్లాడుతూ, తమకు ఏ పార్టీలతో సంబందం లేదని, ఆర్మీ ఉద్యోగాల భర్తీలో తమకు జరిగుతున్న అన్యాయానికి నిరసనలు తెలియజేసేందుకే వచ్చామని చెప్పారు. వారిలో చాలా మంది 20-24 ఏళ్ళలోపు యువకులే. అందరూ ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ శ్రమిస్తున్నవారే. అగ్నిపథ్ ప్రకటనతో తీవ్ర నిరాశనిస్పృహలతో, ఆవేశంతో వారు విధ్వంసానికి పాల్పడ్డారని అర్దమవుతూనే ఉంది.
ఢిల్లీ, యూపీ, బిహార్, హర్యానా రాష్ట్రాలలో కూడా నిరుద్యోగ యువత నిన్న విధ్వంసానికి పాల్పడింది. కనుక నిన్న జరిగిన ఘటనలకు రాజకీయ పార్టీలతో సంబందం లేదని స్పష్టం అవుతోంది. కానీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ అల్లర్లు చేయించిందన్నట్లు మాట్లాడటం చాలా దారుణం.