కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 2021, మార్చిలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ఫలితాలను రద్దు చేయడం. వయో పరిమితిని 21 ఏళ్ళకు, ఉద్యోగ కాలాన్ని నాలుగేళ్ళకు తగ్గించడం.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఏళ్ళ తరబడి శిక్షణ తీసుకొంటూ ఆ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలలో పాల్గొంటుంటారు. వారిలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే కనుక ఓ పక్క తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూనే ఆర్మీ ఉద్యోగాల సాధించడం కోసం సిద్దం అవుతుంటారు. పౌష్టికాహారం లేకపోయినా వారు ఆర్మీలో పరుగు, దేహ దారుడ్య పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేందుకు చాలా శ్రమిస్తారు.
2021, మార్చిలో సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఆర్మీ ఆర్మీ రిక్రూట్మెంట్‌లో మొత్తం 6,900 మంది పాల్గొనగా వారిలో 2,800 మంది అర్హత సాధించారు. కనుక రాత పరీక్షలలో కూడా పాస్ అయితే ఆర్మీలో ఉద్యోగాలు వస్తాయని వారందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా కారణంగా గత రెండేళ్ళుగా రాత పరీక్ష నిర్వహించకపోవడంతో అర్హత సాధించిన అభ్యర్ధులు తీవ్ర నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు వ్రాసినవారు, ఆ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న యువకుల పరిస్థితి ఇంచుమించు ఇదే. లక్షలాది మంది నిరుపేద యువకులు ఆశగా ఆర్మీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే, కేంద్రప్రభుత్వం గత రిక్రూట్మెంట్‌ను రద్దు చేయడమే కాకుండా కేవలం నాలుగేళ్ళు సర్వీసు మాత్రమే ఉండే అగ్నిపథ్ పధకం ప్రవేశపెట్టింది. దీంతో సహజంగానే వారిలో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యి ఈవిదంగా విధ్వంసానికి పాల్పడ్డారు.
అయితే కేంద్రప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తామని నిన్న ఒక్క ప్రకటన చేసి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. కానీ కొందరు కేంద్రమంత్రులు అగ్నిపథ్ పధకాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంతో నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. పైగా జూన్ 24 నుంచి వాయుసేనలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రారంభిస్తామని వాయుసేన అధికారులు ప్రకటించడం, అల్లర్లకు పాల్పడినవారు త్రివిదదళాలలో ఉద్యోగాలకు అనర్హులంటూ రెచ్చగొట్టే విదంగా మాట్లాడటం, నిరసనకారులు మరింత రెచ్చిపోయారు.
కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు కూడా ఢిల్లీ శివార్లలో రైతులు ఏడాదిపాటు ఆందోళనలు చేశారు. చివరికి ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వారికి క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వెనక్కు తీసుకొన్నారు. ఇప్పుడు అగ్నిపథ్‌పై కూడా అదేవిదంగా వ్యవహరించి సమస్యను జటిలం చేసుకోకుండా తక్షణం ఆ ఆలోచనను విరమించుకొంటే మంచిదని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి.