పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెడితే లైసెన్స్ రద్దు!

June 17, 2022


img

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో, ప్రజలలో ఆందోళన మొదలైంది.  దీంతో పెట్రోల్ దొరకదేమో అనే భయంతో అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపుకొని తీసుకువెళుతున్నారు. దీంతో నిజంగానే దేశంలో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడే ప్రమాదం నెలకొంది. 

కనుక కేంద్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలో అన్ని నగరాలు, పట్టణాలలో ఉన్న పెట్రోల్ బంకులలో విధిగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు యధావిధిగా కొనసాగించాలని ఎవరైనా నో స్టాక్ బోర్డులు పెడితే వారి బంకు లైసెన్సు రద్దు చేస్తామని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. దీనికోసం కేంద్రప్రభుత్వం యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ పరిధిని దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులకు విస్తరిస్తున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 

ఈ ఏడాది ఏప్రిల్ 6వరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు తరచూ పెరిగాయి. కానీ వాటితో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండటంతో దానిని కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరల ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దాంతో ఆయిల్ కంపెనీలు ఆ మేరకు ధరలు తగ్గించాయి. 

అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరలు ఉండటంతో సరిహద్దు జిల్లాలలో ఉంటున్నవారు ఎక్కడ చవకగా పెట్రోల్, డీజిల్‌ లభిస్తే అక్కడకు వెళ్ళి కొనుకొంటున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల వద్ద ఉన్న పెట్రోల్ బంకులు దివాళా తీస్తున్నాయి. ఇంకా వివిద కారణాలతో  నష్టపోతున్న బంకు యజమానులు ఆయిల్ కంపెనీలను తమ కమీషన్‌ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించకపోవడంతో బంకుల నిర్వహణ భారంగా మారిందంటూ నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేంద్రప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ తీసుకువచ్చి త్మ లైసెన్సులు రద్దు చేస్తానని బెదిరించడాన్ని బంకుల యజమానులు తప్పు పడుతున్నారు. 


Related Post