హైదరాబాద్‌లో నిన్న కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడి ప్రయత్నంలో చేసిన అల్లర్లు, విధ్వంసంపై కాంగ్రెస్, బిజెపిల స్పందన చాలా హాస్యాస్పదంగా ఉంది.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం కనుసన్నలలో రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎం కేసీఆర్, కేంద్రం ఆదేశం మేరకే పోలీసులతో మమ్మల్ని అడ్డుకొని నిర్బందిస్తున్నారు. మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా గవర్నర్‌కు మా నిరసనలు తెలియజేయాలనుకొంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిక్కడ పోలీసులను మోహరించి మా పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించింది. దీనిని మేము ఖండిస్తున్నాం. కేసీఆర్, మోడీ ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు తెలిపే హక్కుకూడా లేకుండా చేస్తున్నారు,” అని ఆరోపించారు.
నగరంలో కాంగ్రెస్ అల్లర్లపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “టిఆర్ఎస్ సహకారం లేనిదే కాంగ్రెస్ ఈ స్థాయిలో చెలరేగిపోలేదు. మేము రాజ్‌భవన్‌కు వెళ్ళాలనుకొంటే మమ్మల్ని ముందే గృహనిర్బందం చేస్తారు. కానీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నగరంలో విధ్వంసం సృష్టిస్తుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చూసీ చూడనట్లు ఊరుకొంటుంది. రాష్ట్రంలో బిజెపి బలపడుతోందనే భయంతోనే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ కొత్త నాటకం ఆడుతున్నాయి. కనుక ఈ అల్లర్లకు టిఆర్ఎస్ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి,” అని అన్నారు.
రెండు పార్టీల ఈ వాదనలు ఎంత అసంబద్దంగా ఉన్నాయో అర్దమవుతూనే ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ శ్రేణులు నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేస్తూ, పోలీస్ అధికారులపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం, పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చోరు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మోడీ ఆదేశించనవసరం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల బాధ్యత. అయినప్పటికీ పోలీసులు చాలా సంయమనం పాటించడం వలననే కాంగ్రెస్ శ్రేణులు ఇంతగా రెచ్చిపోగలిగాయని వారికీ తెలుసు.
ఇక ఏ ప్రభుత్వమూ తమ పాలనలో ఇటువంటి అల్లర్లు జరగాలని కోరుకోదు. కనుకనే తెలంగాణ ప్రభుత్వం కూడా నగరంలో నిన్న అంత భారీగా పోలీసులను మోహరించి రెచ్చిపోతున్న కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకొని, అరెస్టులు చేసింది. కానీ రాష్ట్రంలో బిజెపిని తగ్గించేందుకే టిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఈ నాటకం ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించడం సిగ్గుచేటు.
రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం పేరుతో ఈవిదంగా ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తూ, ప్రభుత్వాస్తులకు నష్టం కలగజేస్తున్నప్పుడు ప్రభుత్వం ఉపేక్షించకుండా చట్టపరంగా కటిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.