రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయేకి పోటీగా అభ్యర్ధిని నిలబెట్టేందుకు ఇవాళ్ళ ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్బులో దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశమవుతున్నాయి. దీనికి కేసీఆర్‌ను కూడా ఆమె ఆహ్వానించారు. కానీ తాము వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆమె ఆహ్వానించడంతో ఈ సమావేశానికి హాజరుకాకూడదని కేసీఆర్ నిర్ణయించుకొన్నారు.
జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకొంటున్నారు కనుక కాంగ్రెస్ పాల్గొంటున్న ఈ సమావేశానికి దూరంగా ఉండాలనుకోవడం సరైన నిర్ణయమే. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలో బిజెపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినప్పుడు వాటిలో కాంగ్రెస్ పార్టీ ఉందనే కారణంతో ఈ సమావేశానికి దూరంగా ఉండటం ద్వారా మమతా బెనర్జీ ప్రతిపాదన తనకు ఆమోదయోగ్యం కాదని సిఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లయింది. అంతేకాదు... ఆమె నాయకత్వం కూడా తనకు అంగీకారం కాదనే తప్పుడు సంకేతం ఆమెకు పంపినట్లయింది.
ప్రధానమంత్రి పదవి ఆశిస్తున్నవారిలో మమతా బెనర్జీ కూడా ఒకరు. కనుక భవిష్యత్‌లో తనకు పోటీకాబోతున్న కేసీఆర్‌కు మమతా బెనర్జీ సహాయసహకారాలు అందించకపోవచ్చు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకొంటున్నారు కనుక దాని మిత్రపక్షాలు మమతా బెనర్జీ వెనుకే నడిచేందుకు ఆసక్తి చూపవచ్చు లేదా మమతా బెనర్జీ వాటితో కలిసి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ముందుకు సాగుతూ తన ప్రధానమంత్రి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. కనుక జాతీయస్థాయి రాజకీయాలలో కేసీఆర్ వెనుక ఎంతమంది నిలుస్తారనే దానిపై ఆయన విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.