2023 నుంచి 2027 వరకు ఐదేళ్లలో భారత్ టీ20 లీగ్ మ్యాచ్‌ల మీడియా ప్రసారహక్కులను బీసీసీఐ వేలం వేయగా ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.48,390 కోట్లు వచ్చింది.
ఇది మన దేశంలో చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. ఆర్ధికంగా బలంగా ఉన్నాయని భావిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం రెండుమూడు వేల కోట్ల కొరకు కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అప్పులు తెచ్చేకొంటున్నాయి. అవసరమైతే ప్రభుత్వ భూములు కూడా అమ్ముకొంటున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఎంతో బలంగా ఉన్న బీసీసీఐ, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంక వంటి దేశాన్ని కూడా బయటపడేయగలిగే అంత బలమైన ఆర్ధికశక్తిగా ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. దేశంలో తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత సంపన్నమైనది కాగా దాని తరువాత స్థానంలో బీసీసీఐ నిలుస్తున్నట్లు భావించవచ్చు.
ఇది కేవలం టీ20 లీగ్ మ్యాచ్‌ల మీడియా ప్రసారహక్కుల ద్వారా బీసీసీఐకి వచ్చిన ఆదాయం మాత్రమే. ఇంకా వివిద ఫార్మాట్లలో మ్యాచ్‌ల నిర్వహణ, ఐపీఎల్ నిర్వహణ, క్రీడాకారుల వేలంపాటల ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరుతుంటుంది.
ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి ఇంత భారీ ఆదాయం రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందిస్తూ, “మన దేశంలో క్రికెట్ ఆటను ఒక మతంగా భావిస్తుంటారు. క్రికెట్ ఆట డబ్బుకు సంబందించినది కాదు. క్రికెట్‌లో ఎల్లప్పుడూ ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుంది. మన దేశంలో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉందనేది ఈ ప్రసార హక్కుల వేలంపాట ద్వారా మరోసారి స్పష్టమైంది అంతే. భారత్‌లో మొదటి నుంచి క్రికెట్‌లో ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వబట్టే నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాము. భారత్‌లో క్రికెట్‌ను ఇంతగా ప్రోత్సహించిన ప్రజలకు, నిర్వాహకులకు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. ప్రపంచంలో అత్యుత్తమైన ఆటగాళ్ళకు మన దేశంలో కొదవలేదు. ఆటగాళ్ళ శిక్షణకు మరింత మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ మరింతమంది అత్యుత్తమ క్రికెటర్లను దేశానికి, ప్రపంచానికి అందిస్తాము,” అని చెప్పారు.