సిఎం కేసీఆర్ అకస్మాత్తుగా భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయపార్టీ పెట్టబోతున్నట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే నెల 2,3 తేదీలలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. వాటిలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. కనుక సహజంగానే యావత్ దేశ ప్రజల దృష్టి ఈ సభలపైనే ఉంటుంది.
కనుక వాటి నుంచి తెలంగాణతో సహా దేశ ప్రజల, మీడియా దృష్టిని మళ్ళించడానికే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఇంత హడావుడి చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ప్రత్యేక విమానం వేసుకొని వివిద రాష్ట్రాలలో పర్యటించినా ఎవరూ ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు రాలేదు. మరి అటువంటప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ సహాయ సహకారాలు లేకుండా కేసీఆర్ జాతీయ పార్టీ ఏవిదంగా స్థాపించి కొనసాగించగలరు?
సిఎం కేసీఆర్ రాష్ట్రంలో తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు విఫలమయ్యాయనే విషయాన్ని మరుగుపరిచేందుకు, బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జాతీయపార్టీ అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయితే ఈ మీడియా లీకులతో కేసీఆర్ తాత్కాలికంగా అందరి దృష్టి ఆకర్షించగలరేమో కానీ జాతీయరాజకీయాలలో ప్రవేశిస్తే ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు,” అని రఘునందన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.