ఎన్నికల మోడ్‌లో ప్రధాని మోడీ?

June 14, 2022


img

ఎన్నికలలో గెలిచిన రాజకీయ పార్టీలకు 5 ఏళ్ళు దేశాన్ని లేదా రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇస్తే రెండు మూడేళ్ళయ్యేసరికే మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం సన్నాహాలు మొదలుపెట్టేస్తుంటాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మద్యకు బయలుదేరింది. 

కేంద్రప్రభుత్వం కూడా అప్పుడే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించినట్లే ఉంది. వచ్చే ఏడాదిన్నరలోగా దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలలో 10 లక్షల ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారని ప్రధాని కార్యాలయం మరో ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేసింది. 

తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చింది. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా ఆ హామీ నెరవేర్చలేకపోయింది. కనుక ప్రతిపక్షాలు అవకాశం చిక్కినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని విమర్శిస్తుంటాయి. కనుక వచ్చే ఎన్నికలలోగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ఆలోచన కావచ్చు. 

కానీ మోడీ ప్రభుత్వం లాభాలలో ఉన్న కేంద్రప్రభుత్వరంగ సంస్థలను కూడా వరుసగా అమ్మేస్తోంది. వాటిని యదాతదంగా నడవనిచ్చి ఉంటే వాటి ద్వారానే లక్షలమందికి జీవనాధారం లభిస్తుండేది. కానీ మోడీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తుండటంతో వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు అర్దాంతరంగా  రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి, తమపైనే ఆధారపడిన తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే వారి గోడు వినే స్థితిలో ప్రధాని నరేంద్రమోడీ లేరు. ఈవిదంగా ఓ వైపు లక్షలమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తూ 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఏమి ప్రయోజనం?


Related Post