కేసీఆర్‌ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి?

June 14, 2022


img

సిఎం కేసీఆర్‌ భారత్‌ రాష్ట్రీయ సమితి లేదా మరో పేరుతో జాతీయ పార్టీని స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. తన జాతీయ రాజకీయ ప్రవేశంపై ఇంతవరకు ఆచితూచి ముందుకు సాగుతున్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా వేగం పెంచారు. మొన్న ఆదివారం ప్రగతి భవన్‌లో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌, ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో సుదీర్గంగా చర్చించారు. ఈ నెల 19న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మరోసారి దీనిపై లోతుగా చర్చించి అదే రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 

కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి కూడా కారు గుర్తునే కోరాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్‌ను జాతీయ పార్టీలో విలీనం చేసి, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరపునే అభ్యర్ధులు పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ స్థాపించబోయే జాతీయ పార్టీ వివిద రాష్ట్రాలలో కూడా ఎన్నికలలో పోటీ చేయవలసి ఉంటుంది కనుక ఆయా రాష్ట్రాలలో చిన్న పార్టీలను తన పార్టీలో విలీనం చేసుకొని, బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా వివిద రాష్ట్రాలకు పార్టీ ఇన్‌-ఛార్జ్ లను నియమించబోతున్నారు. ఏపీలో ఈ పార్టీకి ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఇన్‌-ఛార్జిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.  కొత్త పార్టీకి ప్రశాంత్ కిషోర్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెలాఖరులోగానే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా అన్ని ఖరారు చేసి ఎన్నికల కమీషన్‌ వద్ద రిజిస్ట్రేషన్ చేసి, జూలై మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీ లేదా హర్యానాలో భారీ బహిరంగసభ నిర్వహించి కొత్త పార్టీని దేశప్రజలకు పరిచయం చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల అధినేతలు, రాకేశ్‌ తికాయత్‌ వంటి రైతు సంఘాల నాయకులు వంటివారిని కలుపుకొన్న సిఎం కేసీఆర్‌ వారందరి సహకారంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ బహిరంగసభకు జనసమీకరణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కనుక మరో ఒకటి రెండు నెలల్లో సిఎం కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీతో జాతీయరాజకీయాలలో ప్రవేశించడం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post