త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి పోటీగా అభ్యర్ధ్ని ఖరారు చేసేందుకు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరికీ లేఖలు వ్రాశారు. దీనిపై చర్చించేందుకు ఈనెల 15వ తేదీన ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమవుదామని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆమె ఆహ్వానించిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఝార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, భగవంత్ సింగ్ మాన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, స్టాలిన్, పినరయి విజయన్‌తో సహా మొత్తం 22 మంది ఉన్నారు.
సిఎం కేసీఆర్ కూడా బిజెపికి పోటీగా రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలనే కోరుకొంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా ఆయన ముందుకు సాగాలనుకొంటున్న సంగతి తెలిసిందే. కానీ మమతా బెనర్జీ ఆహ్వానించిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. కనుక ఒకవేళ సిఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నారని బిజెపి విమర్శిస్తుంది. హాజరుకాకపోతే బిజెపి అభ్యర్ధిని గెలిపించడానికే ఈ సమావేశానికి డుమ్మా కొట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కనుక సిఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదో చూడాలి.