గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో మహిళల సమస్యలు అడిగి తెలుసుకొనేందుకు మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ, “రాజ్‌భవన్‌తో దేశంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రజల కోసమే ఉన్నాయి. మహిళా గవర్నర్‌గా నేను రాష్ట్రంలో సాటి మహిళల కష్టసుఖాలు తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు ప్రయత్నించడం తప్పు కాదు. వారికి అండగా నిలబడటం తప్పు కాదు.
ఇదేమీ రాజకీయ సమావేశం కాదు. కానీ కొందరు ఇది చాలా తప్పని, నా పరిధిని అతిక్రమించడమేనంటూ విమర్శిస్తున్నారు. అటువంటివారిని నేను పట్టించుకొను. ఎవరెన్ని అభ్యంతరాలు చెపుతున్నా నేను ముందుకే సాగుతాను. రాష్ట్రంలో మహిళలు అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదు కదా?ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో మహిళలకు అండదండలు చాలా అవసరమని నేను భావిస్తున్నాను.
కనుక వారికీ ప్రభుత్వానికి మద్య నేను వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తాను. వాటిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు గురించి వివరాలు ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి రెండు రోజులైంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి జవాబు రాలేదు.
నేను ప్రభుత్వాన్ని గౌరవిస్తాను. అదేవిదంగా ప్రభుత్వం కూడా రాజ్‌భవన్‌ను గౌరవించడం అవసరం. నేనేమీ వివాదాలు సృష్టించాలనుకోవడం లేదు. కేవలం నా పరిధిలో నేను చేయగల పనులను మాత్రమే చేస్తున్నాను. కానీ నాపై కొందరు అనవసర విమర్శలు చేస్తూ రాజ్‌భవన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు,” అని అన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాను చేయదలచుకొన్నది చాలా నిర్భయంగానే చేస్తున్నారు. తనను ఎవరూ ఆపలేరని చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కనుక ఇప్పుడు బంతి టిఆర్ఎస్ ప్రభుత్వ కోర్టులోనే ఉన్నట్లు లెక్క. కనుక ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.