రాష్ట్రపతి ఎన్నికకు గంట మ్రోగడంతో ఇప్పుడు అందరి దృష్టి సిఎం కేసీఆర్‌పై పడింది. ఎందుకంటే ఆయన జాతీయస్థాయి రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కనుక. ఇప్పటికే సిఎం కేసీఆర్ పలు రాష్ట్రాలలో పర్యటించి బీజేపియేతర పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. కనుక రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపియేతర పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టడం గురించి కూడా వారితో చర్చించే ఉంటారు. కనుక ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారని అందరూ భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్ధులు నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ఈ నెల 29 వరకు ఉంది. జూలై 18వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ బీజేపికి పోటీగా అభ్యర్ధిని నిలపాలనుకుంటే ఈ నెల 29లోగా ప్రకటించి మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.
ఈసారి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను బరిలో దించాలని సిఎం కేసీఆర్ భావించినట్లు ఆ మద్యన ఊహాగానాలు వినిపించాయి. ఒకవేళ అవే నిజమనుకొంటే సిఎం కేసీఆర్ త్వరలోనే మహారాష్ట్రలోని ఆయన నివశిస్తున్న రాలెగావ్ సిద్ధికి గ్రామానికి బయలుదేరివెళ్ళే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఎన్నికలలో ఎటువంటి వైఖరి అవలంబించాలనే దానిపై చర్చించేందుకు సిఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. కనుక సమావేశం ముగిసిన తరువాత దీనిపై టిఆర్ఎస్ వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది.