వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ సరే మరి ఎమ్మెల్యే?

June 09, 2022


img

జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ నిందితులలో వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు కూడా ఒకరు. ఆయన కారులోనే సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించి ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. అతనిని కాపాడేందుకు, ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో టిఆర్ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట భరించాల్సి వస్తోంది. కనుక ఆయన కొడుకు చేసిన ఈ హేయమైన నేరానికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం ఆ పదవిలో నుంచి తప్పుకోవలసిందిగా టిఆర్ఎస్‌ పార్టీ ఆయనను ఆదేశించింది. 

అయితే పాతబస్తీకి చెందిన ఓ మజ్లీస్‌ ఎమ్మెల్యే కొడుకు కూడా ఈ కేసులో నిందితుడే. అతను కూడా ప్రస్తుతం జువైనల్ హోంలోనే ఉన్నాడు. కానీ మజ్లీస్‌ పార్టీ మాత్రం అతని తండ్రిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరడం లేదు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా మజ్లీస్‌ పార్టీపై ఒత్తిడి చేయడం లేదు. 

తమ మైనర్ కుమారుడు తనకు ప్రభుత్వం ఇచ్చిన అధికార వాహనాన్ని నడపడానికి ఇవ్వడం ఒక నేరమైతే, దానిలో ఒక మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేయడం ఇంకా హేయమైన నేరం. ఒకప్పుడు రైలు, బస్సు ప్రమాదాలు జరిగితేనే కేంద్రమంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులను తృణప్రాయంగా విడిచిపెట్టేవారు. కానీ ఇప్పుడు తమ పుత్రరత్నాలు ఇంత హేయమైన నేరానికి పాల్పడినప్పటికీ వారి తండ్రులు పదవులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. కనుక బలవంతంగా తప్పించడమే సరైనది. అటువంటి వారిని పార్టీలు, ప్రభుత్వం వెనకేసుకువస్తే రేపు ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి వారికి ఓట్లు వేయమని అడుగగలుగుతారు? ఆలోచించుకొంటే మంచిది.


Related Post