ప్రజలు ఎంపీలను ఎన్నుకొంటే, వారు ప్రధాన మంత్రిని ఎన్నుకొంటారని తెలుసు. కానీ రాష్ట్రపతి ఎన్నిక మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎంపీలు, శాసనసభ్యులతో కూడిన వ్యవస్థను ఎలక్ట్రోల్ కాలేజ్ అంటారు. కానీ దానిలో పార్లమెంటు ఉభయసభలలో, అదేవిదంగా రాష్ట్రాలలోని ఉభయసభలలో నామినేటడ్ సభ్యులకు మాత్రం ఓటు హక్కు ఉండదు కనుక వారు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేరు.
ప్రస్తుతం మన భారత్ ఎలక్ట్రోల్ కాలేజ్‌లో 776 మంది ఎంపీలు, 4,033 మంది శాసనసభ్యులు కలిపి మొత్తం 4,809 మంది ఉన్నారు. వారు రాష్ట్రపతిని ఎన్నుకొంటారు. అయితే మళ్ళీ ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి వారి ఓట్ల విలువ మారుతుంటుంది. ప్రస్తుతం ఎంపీల ఓట్ల విలువ 5,43,200 కాగా, ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,43,231గా ఉంది.
ఇప్పుడు ఎన్డీయే ఎంపీల, శాసనసభ్యుల సంఖ్య పెరిగింది కనుక ఓట్ల విలువలో 49 శాతం ఉంది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నేతృత్వంలోని యూపీయేకి 24.02 శాతం ఉంది. ఇతర పార్టీలకు 26.95 శాతం బలం ఉంది.
ఈ ఎన్నికలో నిలబడుతున్న అభ్యర్ధులలో అత్యధిక ఓట్లు విలువ ఎవరికి దక్కుతుందో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. ఈ ఎన్నికలలో ఏ పార్టీలు కూడా తమ సభ్యులకు ఫలాన అభ్యర్ధికే తప్పనిసరిగా ఓట్లు వేయాలని విప్ జారీ చేయడానికి వీలు లేదు. ఈ ఎన్నికలో ఈవీఎంలు ఉపయోగించరు. బ్యాలెట్ పేపర్లనే వాడుతారు కానీ పోస్టల్ బ్యాలెట్ ఉండదు. ఈ ఎన్నికలలో ఎన్నికల కమీషన్ ఇచ్చిన పెన్నునే ఉపయోగించి బ్యాలెట్ పత్రంలో తమక నచ్చిన అభ్యర్ధి పేరు ఎదురుగా బాక్సులో టిక్ పెట్టాలి. వేరే పెన్నుతో టిక్ పెడితే ఆ ఓటుని చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టేస్తారు.
అలాగే రాష్ట్రపతి ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఎవరినా ఓట్లు వేయకూడదనుకుంటే ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోవచ్చు. కానీ ఎన్నికలలో పాల్గొంటే మాత్రం ఎవరో ఓ అభ్యర్ధికి తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులను విమానంలో ఢిల్లీకి చేర్చుతారు. అసలైన ప్రత్యేకత ఇక్కడే ఉంది. ప్రతీ బ్యాలెట్ బాక్సుని ఓ ప్రయాణికుడిగా పరిగణించి ఎన్నికల కమీషన్ విమానాలలో టికెట్ కొంటుంది. విమాన ప్రయాణికుల జాబితాలో కూడా బ్యాలెట్ బాక్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పేరు ఉంటుంది. టికెట్ కూడా అదే పేరు మీద తీసుకొంటారు. కనుక ఆ బాక్సును విమానంలో ప్రయాణికులు కూర్చోనే సీటులోనే పెట్టి రిటర్నింగ్ అధికారులు ఢిల్లీకి తీసుకువస్తారు.