జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడు మైనర్ కావడంతో మిగిలిన ఐదుగురు మైనర్ నిందితులతో పాటు అతనిని కూడా జువైనల్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు. పుష్పాలగూడకు చెందిన మరో నిందితుడి సాదుద్దీన్ మేజర్ కావడంతో అతనిని మాత్రం చంచల్ గూడ జైలులో ఉంచారు.
నాంపల్లిలోని పోక్సో కోర్టు నేటి నుంచి నాలుగు రోజులపాటు అతనిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కనుక పోలీసులు అతనిని ముందుగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వద్ద నుంచి వరుసగా నేరం జరిగిన ప్రాంతాలకి తీసుకువెళ్ళి క్రైమ్ సీన్ రిక్రియెట్ చేసి నేర నిరూపణకు అవసరమైన వివరాలు, సాక్షాధారాలు సేకరిస్తారు.
జువైనల్ హోంలో ఉన్న మైనర్ నిందితులను కూడా ప్రశ్నించేందుకు కస్టడీ కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. వారి కస్టడీకి కోర్టు అనుమతిస్తే వారిని కూడా ప్రశ్నించి నిజానిజాలు రాబట్టడమే కాక వారికి నేర నిరూపణలో కీలకమైన లైంగిక పటుత్వ పరీక్ష కూడా చేయించనున్నారు.
ఈ అత్యాచార కేసులో నిందితులు వాడిన రెండు కార్లలో ఒకటి ఎరుపు రంగు బెంజి కారుని నిందితులలో ఒకడైన మైనర్ బాలుడి తల్లి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కనుక మైనర్ బాలుడికి కారు నడిపేందుకు ఇచ్చినందుకు ఆమెకు పోలీసులు నోటీసు జారీ చేసారు. ఒకవేళ ఆమె సంజాయిషీ సంతృప్తికరంగా లేనట్లయితే ఆమెపై కేసు నమోదు చేస్తారు.
ఇక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే దానిని ఆయన వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నారా లేక వక్ఫ్ బోర్డు తరపున పొంది అధికారికంగా వినియోగిస్తున్నారా?అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సనత్ నగర్‌కు చెందిన దినాజ్ జహాన్ అనే వ్యక్తి 2019లో ఆ కారును కొన్నట్లు పోలీసులు కనుగొన్నారు. కానీ ఇంతవరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబరుతోనే దానిని నడుపుతుండటం మరో విశేషం.
దానిని నిందితుడి తండ్రి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ లీజుకి తీసుకొన్నట్లు పోలీసులు గుర్తించారు. కనుక ఆ కారుకి సంబందించి పూర్తి వివరాల కోసం వక్ఫ్ బోర్డుకి ఓ లేఖ వ్రాశారు. ఆర్టీఏలో కూడా దానికి సంబందించి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా పోలీసులు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు.