కేంద్రమంత్రితో సామరస్యంగా మంత్రి కేటీఆర్‌ భేటీ!

June 09, 2022


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓడిపోయినప్పటి నుంచి కేంద్రప్రభుత్వంపై కత్తులు దూస్తున్న టిఆర్ఎస్‌ చాలా నెలల  తరువాత తొలిసారిగా కేంద్రంతో సామరస్యంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ భవన్‌ రెసిడెంట్ కమీషనర్‌ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు సురేశ్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావులతో కలిసి బుదవారం ఢిల్లీలో కేంద్ర ఎలెక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలు, సదుపాయాలు కల్పిస్తూ పెట్టుబడులను, పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రికి తెలియజేశారు. నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో అభివృద్ధికి గల అవకాశాలపై ఈ సమావేశంలో గౌరవ కేంద్రమంత్రితో చర్చించామని ట్వీట్ చేస్తూ కేంద్రమంత్రితో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. 

గత కొన్ని నెలలుగా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించడమే తప్ప ఎన్నడూ ఈవిదంగా సామరస్యంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కనుక కేంద్రం పట్ల టిఆర్ఎస్‌ వైఖరిలో మళ్ళీ సానుకూలమార్పు వచ్చిందా?అనే సందేహం కలుగుతోంది. ఎన్నికలకి ఇంకా సుమారు రెండేళ్ళ సమయం ఉండగా ఇప్పటి నుంచే కేంద్రంతో ఘర్షణ పడటం వలన ఇబ్బందులే తప్ప ఒరిగేదేమి లేదనే సత్యం టిఆర్ఎస్‌ గ్రహించిందేమో?కేంద్రమంత్రితో  కేటీఆర్‌ బృందం సామరస్య సమావేశం సాధారణమైనదేనా లేదా కేంద్రం పట్ల టిఆర్ఎస్‌ వైఖరిలో మార్పుకి సంకేతమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.



Related Post