గవర్నర్‌ తమిళిసై నిర్ణయం.. మరో యుద్ధానికి బీజం

June 08, 2022


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కేసీఆర్‌కు మద్య దూరం పెరగడంతో రాజ్‌భవన్‌కి, ప్రభుత్వానికి మద్య కూడా సహజంగానే దూరం పెరిగింది. గత ఏడు నెలలుగా సిఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్ళలేదు. గణతంత్ర దినోత్సవం, తెలంగాణ అవతరణ దినోత్సవం వంటి అతి ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు నిర్వహించుకొన్నారు. 

ఈ నేపద్యంలో గవర్నర్‌ తమిళిసై ఈ నెల 10వ తేదీన రాజ్‌భవన్‌లో  ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా మహిళలతో మహిళా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు మహిళా దర్బార్ నిర్వహించబోతున్నట్లు రాజ్‌భవన్‌ అధికారులు ప్రకటించారు.  

గవర్నర్‌ పాత్ర చాలా పరిమితమైందని ఆమె దానికే పరిమితంగా ఉండాలని, కానీ ఆమె తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను విమర్శిచారు. ఆయన సిఎం కేసీఆర్‌ మనసులో అభిప్రాయాన్నే వ్యక్తం చేశారని వేరే చెప్పక్కరలేదు. 

కనుక ఆమె సిఎం కేసీఆర్‌ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రజా దర్బార్ నిర్వహించడానికి సిద్దం అవుతున్నారు కనుక మళ్ళీ టిఆర్ఎస్‌ నేతలు ఆమెపై విమర్శలు గుప్పించవచ్చు. అప్పుడు ఆమె, ఆమె తరపున బిజెపి నేతలు కూడా వారిపై ఎదురుదాడి చేయడం ఖాయం. కనుక ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు తీర్చడం మాట అటుంచి కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Related Post