ఖమ్మంలో మంగళవారం ఓ విషాదకర ఘటన జరిగింది. చిర్రా సందీప్ (23) అనే దినసరి కార్మికుడు నగరంలోని నయాబజార్ కళాశాల పక్కన గల రక్షిత మంచి నీళ్ళ ట్యాంకులో దిగి శుభ్రపరుస్తుండగా దాని నుంచి నగరానికి నీళ్ళు సరఫరా అయ్యే పైప్ లైనులో ప్రమాదవశాత్తు జారి చనిపోయాడు.
అతనితో పనిచేస్తున్న మిగిలిన ఇద్దరు కార్మికులు వెంటనే అధికారులకు తెలియజేయడంతో వారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్క్యూ బృందాలకి సమాచారమిచ్చారు. వారు ఆ పైపు లైనుకి కొంత దూరంలో జేసీబీతో తవ్వించి అక్కడ పైపును కట్ చేసి చూడగా దానిలో సందీప్ కాళ్ళు కనబడ్డాయి. అప్పుడు ఆ పైపును పూర్తిగా కట్ చేసి దానిలో నుంచి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు.
నగరంలో రక్షిత మంచి నీటి ట్యాంకులను నెలకు ఒకటి రెండుసార్లు అనుభవం కలిగిన కార్మికులతో శుభ్రపరుస్తుంటారు. అయితే నిన్న రోజూ పనిచేసే కార్మికులలో కొంతమంది రాకపోవడంతో దినసరికూలిపై సందీప్‌ను తీసుకువచ్చారు. అతనికి అనుభవం లేకపోవడంతో ప్రమాదవశాత్తు సుమారు అడుగున్నర వ్యాసం ఉన్న పైపులైనులోకి జారిపోయి దానిలో మిగిలి ఉన్న నీళ్ళలో ఊపిరి ఆడక చనిపోయాడు.
అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలననే సందీప్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో, ప్రభుత్వం తరపున అతని కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.