జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసుపై సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్

June 08, 2022


img

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక సామూహిక అత్యాచార కేసు గురించి నగర సిపి సివి ఆనంద్ నిన్న రాత్రి మీడియాకు వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా.. 

• మే 28న మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. ప్రభుత్వ వాహనం స్టిక్కర్ ఉన్న ఇన్నోవా కారులో అత్యాచారం చేశారు. 

• వారిలో సాదుద్దీన్ (18) తప్ప మిగిలిన ఐదుగురు నిందితులు మైనర్లు. కనుక వారి పేర్లను వెల్లడించలేము. వారందరిపై కేసులు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించాము.  

• ఆరుగురు నిందితులలో ఒకరు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాము.  

• నలుగురు నిందితులు (మైనర్లు) పధకం ప్రకారమే బాలికను అమ్నేసియా పబ్ వద్ద సాయంత్రం 5.43 గంటలకు తమ బెంజికారులో ఎక్కించుకొని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు కూడా తీసుకొని వాటిని లీక్ చేశారు.

• వెనుక ఇన్నోవా కారులో సాదుద్దీన్, మరో ఇద్దరు మైనర్లు, ఇన్నోవా కారు డ్రైవరు ఆ కారును ఫాలో చేశారు. 

• సాయంత్రం 5.51 గంటలకు రెండు కార్లలో వారు బంజారాహిల్స్‌లో బేకరీకి చేరుకొన్నారు. అక్కడ సుమారు  గంటసేపు గడిపిన తరువాత సాదుద్దీన్ మరో ఐదుగురు మైనర్లు ఆమెను ఇన్నోవా కారులో ఎక్కించుకొని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 44లో నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ ఒకరి తరువాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. 

• కారులో ఉన్న ఆరో మైనర్ బాలుడు ఆమెపై అత్యాచారం చేయలేదు కానీ ఆ సమయంలో అతను కూడా అక్కడే ఉన్నందున ఈ నేరంలో పాలు పంచుకొన్నట్లే కనుక అతనిపై కూడా కేసు నమోదు చేశాము.  

• బాలికపై నిందితులు అత్యాచారం చేసిన తరువాత వారు రాత్రి 7.31 గంటలకు ఆమెను అదే కారులో మళ్ళీ పబ్ వద్ద దింపేసి వెళ్ళిపోయారు. రాత్రి 7.35 గంటలకు ఆమె తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళారు. 

• మే 31వ తేదీ వరకు ఈ ఘటన గురించి ఆమె తల్లితండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి వారికి అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

• అప్పటికీ బాలిక అత్యాచారం గురించి చెప్పకపోవడంతో ఆమెను భరోసా కేంద్రానికి పంపగా అక్కడ డీసీపీ శిరీష ఆమెతో అనునయంగా మాట్లాడితే తనపై అత్యాచారం జరిగిందని బాలిక చెప్పింది. కానీ అప్పుడు ఒకరి పేరే చెప్పింది. ఆ వివరాలు ఆధారంగా జూన్‌ 3వ తేదీన ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను అరెస్ట్ చేశాము. జూన్‌ 4వ తేదీన ఇద్దరిని, 5వ తేదీన మరో మైనర్ నిందితుడిని అదుపులో తీసుకొన్నాము. 

• సిసి కెమెరాల రికార్డులన్నీ పరిశీలించిన తరువాత జూన్‌ 6,7 తేదీలలో మరో ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకొన్నాము. 

• నిందితులపై పోక్సో, అత్యాచారానికి సంబందించి సెక్షన్ 376(డి), గాయపరచడం (366 (ఏ) పోక్సో, మైనర్ బాలిక అపహరణ, వీడియో తీసి సర్క్యూలేట్ చేసినందుకు ఐటి సెక్షన్ 67, లైసెన్స్ లేకుండా కారు నడిపినందుకు కేసులు నమోదు చేశాము.    

• నిందితులలో ఒక్కరూ తప్ప మిగిలిన వారందరూ మైనర్లు అయినందున సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరి పేర్లు చెప్పలేము. 

• ఈ అత్యాచార కేసుతో హోంమంత్రి మనుమడికి ఎటువంటి సంబందమూ లేదు. అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఎవరి వద్దనైనా ఉన్నట్లయితే మాకు అందించవచ్చు.  

• ఈ కేసులో మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేవని సిపి సివి ఆనంద్ చెప్పారు. ఈ కేసులో ఆరో నిందితుడు ఎమ్మెల్యే కుమారుడేనా అనే విలేఖరుల ప్రశ్నకు అతను మైనర్ కనుక పేరు చెప్పలేమన్నారు. అతని పేరు చెప్పకపోయినా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఈ అత్యాచారం చేసినవారిలో ఒకరని సిపి సివి ఆనంద్ దృవీకరించారు. 


Related Post