తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. ఇకపై ప్రభుత్వాసుపత్రులలో కొత్తగా ఉద్యోగాలలో చేరే వైద్యులు ఎవరూ బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని జీవో జారీ చేసింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసస్ నిబంధనలను సవరించిన్నట్లు తెలియజేసింది.
త్వరలో 12,755 వైద్య సిబ్బంది భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వాటిలో సుమారు 10,000 పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్ ఆర్‌బీ) ద్వారా మిగిలిన పోస్టులను టిఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతోంది.
ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధన విధించడం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తున్నప్పుడు వారి పూర్తి సమయం ప్రభుత్వాసుపత్రులలో పనిచేయాలనుకోవడం తప్పు కాదు. కనుక ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేయాలనుకొనేవారు ఇప్పుడే ఆలోచించుకొని అదే ముఖ్యమనుకొంటే ఈ ఉద్యోగాలను వదులుకోవచ్చు. దాని వలన కేవలం ప్రభుత్వాసుపత్రులలో మాత్రమే పనిచేసేందుకు సిద్దపడే వైద్యులకు అవకాశం లభిస్తుంది.