డిజిపికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు

June 07, 2022


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్‌ మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమీషన్‌ స్పందించింది. ఈ కేసులో వ్యక్తిగత శ్రద్ద చూపుతూ వీలైనంత త్వరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరింది. ఈ కేసుకు సంబందించి పూర్తి నివేదికను వారం రోజుల లోపుగా పంపించాలని కోరింది. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి నివేదిక రూపంలో పంపవలసిందిగా మహిళా కమీషన్‌ కోరింది.

ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ, దోషులను కాపాడేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముందే హెచ్చరించారు. కనుక ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. 

ఈ నేపధ్యంలో బాధితురాలి నుంచి మళ్ళీ మరోసారి వాంగ్మూలం తీసుకొన్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కేసులోని 5వ నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే కుమారుడి కోసం గాలిస్తున్నారు. 

అసలే రాష్ట్రంలో బిజెపి చాలా జోరుగా ఉంది. మరో 25 రోజులలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. వాటికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో బిజెపి అగ్రనేతలందరూ హాజరవుతారు. 

ఇటువంటి సమయంలో నగరం నడిబొడ్డున ఓ మైనర్ బాలికను టిఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్‌కు చెందిన నేతల కుమారులు సామూహిక అత్యాచారం చేయడం, ఇది జరిగి 10 రోజులైనా పోలీసులు గోప్యత పాటిస్తుండటం, ప్రతిపక్షాలు ఆందోళనలు, విమర్శలు, ఆరోపణలు, ఓ పక్క గవర్నర్‌ తమిళిసై, మరోపక్క జాతీయ మహిళా కమీషన్‌ నివేదికలు కోరుతుండటం వంటి ఈ పరిణామాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారాయి. అందుకే ప్రభుత్వంలో పార్టీలో ఎవరూ ఈ గ్యాంగ్ రేప్ కేసు గురించి మాట్లాడటం లేదు. కనీసం ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు సమాధానం చెప్పడం లేదని భావించవచ్చు. 

కనుక ఈ కేసును ఎంత త్వరగా పరిష్కరించగలిగితే అంత మంచిది. కానీ కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకి కోపం అన్నట్లు, ఈ కేసులో ముందుకు వెళితే మజ్లీస్‌తో శతృత్వం, వెనక్కు తగ్గితే ప్రజలు, ప్రతిపక్షాలకు, మున్ముందు కోర్టులకు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ సమస్యను సిఎం కేసీఆర్‌ ఏవిదంగా పరిష్కరిస్తారో చూడాలి. 


Related Post