రేప్ కేసుతో టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు

June 04, 2022


img

నగరంలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో మజ్లీస్‌ ఎమ్మెల్యే, మరికొందరు ప్రముఖుల కుమారులు నిందితులని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ఈ సమస్య టిఆర్ఎస్‌ ప్రభుత్వం మెడకు చుట్టుకొంది. గత నెల 28న బాలికపై అత్యాచారం జరిగితే ఆ విషయాన్ని ఇంతవరకు పోలీసులు దాచిపెట్టడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసులు కలిసి నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించక తప్పలేదు. 

ఇతర కేసులలో గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించే పోలీసులు, ఈ కేసులో ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడంతో, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు మంచి అవకాశం లభించింది. 

అయితే మజ్లీస్‌ నేతల కుమారులను అరెస్ట్ చేస్తే ఆ పార్టీతో ప్రభుత్వానికి ఇబ్బంది మొదలవుతుంది. అలాగని ఉపేక్షిస్తే ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, మహిళా కమీషన్‌, మానవ హక్కుల కమీషన్ తదితరులను తట్టుకోవడం కష్టం. అదీగాక ప్రజల దృష్టిలో కూడా ప్రభుత్వం పలుచన అవుతుంది. 

ఇక ఈ అత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దిశ కేసులో నేరస్తులు నిరుపేదలు, బలహీన వర్గాలకు చెందినవారు కనుక పోలీసులు మరో ఆలోచన లేకుండా వారిని ఎన్కౌంటర్ చేసేశారని, కానీ తమ ఎమ్మెల్యేలు, నేతల పిల్లలు అదే నేరం చేస్తే వారిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కనుక ఈ కేసు విషయంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. మరి నేరస్తులను శిక్షిస్తుందా లేదా కేసును నాన్చుతూ మరో అంశంతో ప్రజలు, మీడియా, ప్రతిపక్షాల దృష్టి మళ్లించి వారిని కాపాడుతుందా? చూడాలి.


Related Post