ప్రతిపక్షాలకు కేసీఆర్‌ ఆ అవకాశం లేకుండా చేశారా?

June 02, 2022


img

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు యథాప్రకారం సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం, పరిపాలనపై విమర్శలు గుప్పించాయి. సిఎం కేసీఆర్‌ నిరంకుశ పాలన చేస్తున్నారని ఒకరు, కుటుంబ పాలన చేస్తున్నారని మరొకరు, అవినీతిలో మునిగిపోయారని మరొకరు విమర్శలు గుప్పించారు. అయితే వాటన్నిటికీ సిఎం కేసీఆర్‌ రాష్ట్రాభివృద్ధితోనే సమాధానం చెప్పారని చెప్పవచ్చు. అందుకే ప్రతిపక్షాలు అభివృద్ధి గురించి మాట్లాడలేక నిరంకుశ పాలన, కుటుంబపాలన గురించి మాట్లాడుతున్నాయనుకోవచ్చు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సిఎం కేసీఆర్‌ రాష్ట్రాభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షాలతో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారా? అయన కుటుంబంలో ఎంతమంది ప్రభుత్వంలో పదవులు చేపట్టారనే విషయం ప్రజలు పట్టించుకోకపోవచ్చు.

ఉదాహరణకు మంత్రి కేటీఆర్‌ నాయకత్వ లక్షణాలు, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన సమర్ధత, వాటి ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించేలా చేయడంతో ప్రజలు అయన పట్ల సంతృప్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. 

అదేవిధంగా గత ప్రభుత్వంలో జలవనరులశాఖ మంత్రిగా హరీష్ రావు కాళేశ్వరం వంటి అతిపెద్ద ప్రాజెక్టును విజయవంతంగా నిర్మించడం, మళ్ళీ రెండోసారి ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖలకు మంత్రిగా ఆయన సమర్ధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా రాష్ట్ర ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని చెప్పవచ్చు. 

సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎంపీగా తన సమర్థతను నిరూపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ ఆమె స్థాయికి ఆ పదవికి చాలా చిన్నదనే చెప్పవచ్చు. ఇప్పటికే కేసీఆర్‌ కుటుంబపాలన సాగిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కోవలసి వస్తున్నందునే సిఎం కేసీఆర్‌ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయి ఉండవచ్చు. కానీ మంత్రి పదవి ఇచ్చి ఉంటే కల్వకుంట్ల కవిత తన సమర్థతను తప్పకుండా నిరూపించుకొని ఉండేవారని అందరికీ తెలుసు. 

అయితే కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలున్నాయి. ఉదాహరణకు ధరణీ సమస్యలు, మాదకద్రవ్యాల వాడకం, మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు, నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపకం వంటి  అనేకానేక సమస్యలున్నాయి. కనుక ప్రతిపక్షాలు ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని నిరుపయోగమైన రాజకీయ అంశాల గురించి కాకుండా రాష్ట్రానికి అవసరమైన ఇటువంటి అంశాల గురించి, సమస్యల పరిష్కారం గురించి నిర్మాణాత్మక విమర్శలు చేయగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు కదా?  


Related Post