తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికీ 8 ఏళ్ళు పూర్తయింది. తెలంగాణ కంటే ముందు చాలా ఏళ్ళ క్రితమే ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌ఘడ్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆ మూడు రాష్ట్రాలకు అనేక వనరులు ఉన్నప్పటికీ నేటికీ అవి సమస్యల నుంచి బయటపడలేకపోయాయి. అభివృద్ధి చెందలేకపోయాయి. జూన్ 2నే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. వాస్తవం చెప్పాలంటే ఏపీలో రాష్ట్ర విభజనకు పూర్వం ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉండేదో మళ్ళీ ఆ స్థితికి చేరుకొంది.
ఈ నాలుగు రాష్ట్రాలలో సాధ్యం కానిది తెలంగాణ రాష్ట్రంలో ఏవిదంగా సాధ్యపడిందంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే బలమైన సంకల్పం, చిత్తశుద్ది, దూరదృష్టి కారణమని చెప్పవచ్చు. కేవలం 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది యావత్ దేశానికే ఆదర్శంగా నిలవడం మన అందరికీ గర్వకారణం.
బలమైన నాయకత్వం, సుస్థిరమైన పరిపాలన ఉన్నట్లయితే ఓ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రమే ఓ ప్రత్యేక నిదర్శనంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఈ క్రెడిట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన ఆదేశాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని పనిచేసే మంత్రులు, అధికారులు, ఉద్యోగులకే దక్కుతుంది.
తెలంగాణ ఏర్పడగానే మొదట విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు శాస్వితమైన చర్యలు చేపట్టారు. ఆ కారణంగానే నేడు దేశంలో పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకోగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మిగులు విద్యుత్ ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు కనుకనే దేశవిదేశాలకు చెందిన అనేక వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తరువాత సిఎం కేసీఆర్ సాగు, త్రాగునీరు, ఆ తరువాత వరుసగా వ్యవసాయం, మౌలిక వసతులు, వైద్యం, ప్రజారోగ్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వాటినీ అభివృద్ధి చేశారు.
అయితే అంతకంటే ముందు ఆయా శాఖలను అభివృద్ధికి అవరోధంగా ఉన్న చట్టాలలో అవసరమైన మార్పులు చేసి, అర్ధరహితమైన నియమ నిబందనలను తొలగించి, నూతన, సరళమైన విధానాలు రూపొందించడం వలననే ఇంత అభివృద్ధి సాధ్యపడిందని చెప్పవచ్చు. తెలంగాణ అభివృద్ధిలో వివిద రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, ఇంజనీర్ల సలహాలు, సూచనలు, తోడ్పాటును ప్రభుత్వం స్వీకరించడం కూడా సత్ఫలితాలు ఇచ్చింది.
పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్‌తో కలిపి 33 జిల్లాలుగా పునర్విభజించడం, కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించడం మరో గొప్ప సాహసోపేతమైన నిర్ణయమని చెప్పవచ్చు. తొలుత వీటిలో అనేక సమస్యలు ఎదురైనప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కంగారుపడకుండా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగడం వలన తెలంగాణ రాష్ట్రం నేడు పరిపూర్ణమైన రూపంతో మన కళ్ళ ముందు నిలిచింది.
తెలంగాణ ఉద్యమాలకు ప్రధాన కారణాలైన నీళ్ళు, నిధులు, నియమకాలలో మొదటి రెండూ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటైన అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, ఐటి కంపెనీల ద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు ఉపాది పొందుతున్నారు. ఇప్పుడు 33 జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. అంటే కేవలం ఈ 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఉద్యమ ఆకాంక్షలను కూడా నెరవేర్చుకోగలిగినట్లు స్పష్టం అవుతోంది.
రెండేళ్ళ పాటు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేసినప్పటికీ ఆ ఆటుపోటులను తట్టుకొని నిలబడటమే కాకుండా స్థిరంగా అభివృద్ధి సాధించడం చాలా గొప్ప విషయం. కరోనా నేర్పిన గుణపాఠాలతో రాష్ట్రంలో వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఈ సమస్యను కూడా ఓ అవకాశంగా మలుచుకొని ఫార్మా, లైఫ్ సైన్సస్, వైద్య పరికరాల ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం తెలగాణ ప్రభుత్వ దూరదృష్టికి ఓ గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ 8 ఏళ్ళలోనే తెలంగాణలో జరిగిన వ్యవసాయాభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఒకప్పుడు సాగునీరు లేక బోరుబావులు తవ్వించుకొని, నీళ్ళు పడక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంతో సహా పలు ప్రాజెక్టులు కట్టి వారి కష్టాలన్నిటినీ తీర్చి వారికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ, రైతు బంధు వంటి పధకాలతో అండగా నిలబడటంతో కేంద్రం కూడా కొనుగోలు చేయలేనంత ధాన్యం ఇప్పుడు రాష్ట్రంలో పండుతోంది. ఒకప్పుడు కరువుకాటకాలతో విలవిలలాడిన తెలంగాణ రైతన్నలు ఇప్పుడు విదేశాలకు బియ్యం ఎగుమతి చేయగల స్థాయికి ఎదిగారు.
ఈ 8 ఏళ్ళలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి వ్రాయాలంటే ఇంకా చాలా ఉంది. దాని కోసం ప్రత్యేకంగా ఓ పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది. కనుక కొండను అద్దంలో చూపే చిన్న ప్రయత్నమే ఇది.
దేశంలో అనేక రాష్ట్రాలు ఏమాత్రం అభివృద్ధి సాధించకపోయినా రాష్ట్ర ఆవిర్భవోత్సవాలను జరుపుకొంటూనే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి సాధించినందుకు నేడు గర్వంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవోత్సవాన్ని ఓ పండగలా జరుపుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకి, అధికారులకి, ఉద్యోగులకి, రాష్ట్ర ప్రజలందరికీ మైతెలంగాణ.కామ్ శుభాభినందనలు తెలియజేస్తోంది.