ఇదివరకు ఐటి కంపెనీలకు బెంగళూరు నగరం కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ దానిని మించిపోయింది. ఈరోజు హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఆర్ధిక సంవత్సరాలకి సంబందించి రాష్ట్ర ఐటి నివేదికను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “గత ఏడాది కరోనా ప్రభావం చాలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఐటి రంగంలో వృద్ధిరేటు 26.14 శాతంగా నమోదైంది. జాతీయ సగటు వృద్ధిరేటు 17.2 శాతం కాగా తెలంగాణలో దాని కంటే మరో 9 శాతం ఎక్కువగా ఉంది. గత ఏడాది కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి ఎగుమతులు (సేవలు) విలువ రూ.1,83,569 కోట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో 4.5 లక్షల ఉద్యోగాలు లభిస్తే, వాటిలో ఒక్క హైదరాబాద్ నగరంలోని ఐటి కంపెనీల ద్వారానే లక్షన్నర ఉద్యోగాలు వచ్చాయి. గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4.1 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఐటి రంగంలోనే 7,78,121 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదంతా కేవలం 8 ఏళ్ళ స్వల్ప వ్యవధిలో సాధ్యం అయ్యింది. ఈ నెల 20 నుంచి రెండో దశ టీ-హబ్ ప్రారంభించబోతున్నాము. అలాగే టీ-వర్క్స్ అనే కొత్త ఫెసిలిటీని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము,” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మంత్రి కేటీఆర్ చూపుతున్న చొరవ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి నెలకు సగటున రూ.200-300 కోట్లు పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. వాటిలో అనేక ఐటి కంపెనీలతో పాటు ఫార్మా, మెడికల్ డివైజస్, హెల్త్ సైన్స్, ఆటోమోబైల్, టెక్స్‌టైల్, ఏరో స్పేస్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
వీటికి సమాంతరంగా కామధేనువు వంటి ఐటి రంగాన్ని కూడా హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు విస్తరింపజేస్తుండటంతో ఐటి సంబందిత ఉద్యోగాలు పెరిగాయి. వాటితో పాటు ఐటి రంగంలో వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఇదే పట్టుదల, వేగంతో ముందుకు సాగినట్లయితే, రాబోయే రోజుల్లో యావత్ దేశానికి హైదరాబాద్ ఐటి రాజధానిగా మారగలదు.