తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న రాష్ట్ర బిజెపి నేతలకి వారి అధిష్టానం గొప్ప కిక్కునిచ్చే వార్త చెప్పింది. ఈసారి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో మూడు రోజులపాటు సాగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా ఆ పార్టీ ముఖ్యనేతలందరూ వచ్చి మూడు రోజులు హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర నేతలతో సహా సుమారు 300 మంది వరకు బిజెపి నేతలు హాజరుకానున్నారు.
ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారారు. సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిత్యం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందని, హామీలు అమలుచేయడం లేదంటూ ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు, ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు కూడా ఆయన చేత కూడా కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని చెప్పించడంతో టిఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సిఎం కేసీఆర్ తన అవినీతిని, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే జాతీయరాజకీయాలు అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ పదేపదే ఆరోపిస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఈ సమయంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలనుకోవడం ఇంకా ఒత్తిడికి గురిచేయడానికే అని వేరే చెప్పక్కరలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఏవైనా తప్పటడులు వేస్తే బిజెపి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక ఇది పిల్లికి చలగాటం... ఎలక్కి ప్రాణసంకటం వంటిదే అని భావించవచ్చు.