హైదరాబాద్‌లో అరుదైన శస్త్ర చికిత్స: తెగిన చేతిని అతికించిన వైద్యులు

June 01, 2022


img

హైదరాబాద్‌లో సిటిజన్ హాస్పిటల్‌ వైద్యులు అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేసి రెండుగా తెగిన చేతిని మళ్ళీ అతికించారు. నల్లగండ్లలోని సిటిజన్స్ హాస్పిటల్‌లో ఆర్దోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజు గొట్టిముక్కల నేతృత్వంలో డాక్టర్‌ వాసుదేవ్‌ జువ్వాడితో సహా మరో ఇద్దరు ఆర్దోపెడిక్ వైద్యులు, ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్లు, ఒక ఎనస్తీషియన్ వైద్యుల బృందం సుమారు 8 గంటలపాటు హరీష్ అనే యువకుడికి శస్త్ర చికిత్స చేసి మణికట్టు వరకు తెగిపోయిన చేతిని మళ్ళీ దాని స్థానంలో అతికించారు. 

 ఆ యువకుడికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ అశోక్ రాజు బృందం నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సంగారెడ్డి పరిధిలోని నందిగాంలో ఓ కూల్ డ్రింక్స్ తయారుచేసే కంపెనీలో హరీష్ (22) పని చేస్తున్నాడు. 15 రోజుల క్రితం అతను ఓ మెషిన్‌ వద్ద పనిచేస్తుండగా అతని చెయ్యి దానిలో ఇర్రుకొని మణికట్టువరకు తెగిపోయింది. 

ఆ కంపెనీ సిబ్బంది వెంటనే అతనిని, ఆ తెగిన చేతిని తీసుకొని మా వద్దకు తీసుకువచ్చారు. మేము వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేసి తెగిన చేతిని యధాస్థానంలో అమర్చాము. అప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. అతని చెయ్యి క్రమంగా సాధారణ పరిస్థితికి వస్తోంది. మరో రెండు వారాల తరువాత కట్లు విప్పి పరిశీలించిన తరువాత ఫిజియో థెరపీ చేయిస్తాము. క్రమం తప్పకుండా ఫిజియో థెరపీ చేసినట్లయితే మరో ఆరునెలల్లో ఆ చేతితో ఇదివరకులా అన్ని పనులు చేసుకోగలుగుతాడు. 

చాలా మందికి అవగాహన లేకపోవడం వలననే తెగిన అవయవాలను వదిలేసి రోగులను మాత్రం హాస్పిటల్‌కు తీసుకువస్తుంటారు. కానీ తెగిన అవయవాన్ని దుమ్ము, దూళి సోకకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆరు గంటలలోపుగా హాస్పిటల్‌కు తీసుకురాగలిగితే ఇదేవిదంగా శస్త్ర చికిత్స చేసి వాటిని మళ్ళీ యధాస్థానంలో అమర్చవచ్చు,” అని చెప్పారు. 


Related Post