మన నల్లబంగారంలో మెరిసిన వజ్రం... ఆకునూరి నరేష్

May 31, 2022


img

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాశింపల్లికి గ్రామానికి చెందిన ఆకునూరి నరేష్ (29) సివిల్స్ ఫలితాలలో జాతీయ స్థాయిలో 117వ ర్యాంక్ సాధించాడు. అయితే అతనిది కనీసం మద్యతరగతి కుటుంబం కూడా కాదు. తండ్రి ఐలయ్య దినసరి కూలి. తల్లి సులోచనమ్మ సింగరేణిలో అవుట్ సోర్సింగ్‌ కింద స్వీపరుగా పనిచేస్తుంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. 

అటువంటి కుటుంబ నేపద్యం నుంచి వచ్చిన నరేష్ ఇప్పుడు ఐఏఎస్ అధికారి కాబోతున్నాడు. నరేష్ చిన్నప్పటి నుంచే చదువులలో ప్రతిభ కనబరిచేవాడు. దాంతో తల్లితండ్రులు ఇద్దరూ అతని కోసమే అన్నట్లు పైసా పైసా కూడబెడుతూ చదివించారు.

నరేష్ 5వ తరగతి వరకు కాశింపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొన్నాడు. పదో తరగతి వరకు నర్సంపేటలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో చదువుకొన్నాడు. ఆ తరువాత రంగారెడ్డి జిల్లా చిల్కూరులోని ఏపీఎస్ డబ్ల్యూ ఆర్‌సిఎం జగన్మోహన్ రెడ్డి (బాయ్స్)కాలేజీలో ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తిచేశాడు. 

అక్కడి నుంచే నరేష్ అసలు ప్రయాణం మొదలైంది. 2015లో మద్రాస్ ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో జీవితంలో తొలి విజయం సాధించారు. ఆ తరువాత మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. ఇంజనీరింగ్ పూర్తికాగానే చెన్నై సిటీ బ్యాంకులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనలిస్టుగా ఉద్యోగం వచ్చింది. 

ఆ ఉద్యోగం చేస్తూనే శంకర్ ఫౌండేషన్ అకాడమీలో సివిల్స్ కోచింగ్ తీసుకొన్నాడు. తొలిసారిగా 2017 సివిల్స్ వ్రాశాడు కానీ విజయం సాధించలేకపోయాడు. మళ్ళీ 2019లో వ్రాసి జాతీయ స్థాయిలో 782వ ర్యాంక్ సాధించాడు. దాంతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసస్‌లో ఉద్యోగం వచ్చింది. దానిలో చేరి శిక్షణ పొందుతూ మరో రెండుసార్లు మళ్ళీ ఐఏఎస్ వ్రాశాడు. కానీ 5వ ప్రయత్నంలో 117వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 

తమ కుమారుడు ఎంతో శ్రమించి పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికి రావడంతో నరేష్ తల్లితండ్రుల ఆనందానికి అవదులే లేవు. ఇన్నేళ్ళ తమ కష్టానికి తమ కొడుకు రూపంలో ఫలించిందని వారు మురిసిపోతున్నారు. నరేష్ కూడా ఇంతకాలం తనకు అండగా నిలబడిన తల్లితండ్రులను ఇక జీవితంలో ఏ కష్టమూ లేకుండా హాయిగా జీవించేలా చూసుకొంటానని చెప్పాడు. తన తల్లితండ్రులు తన ప్రతిభను గుర్తించి, ఎంతో కష్టపడి తనను చదివించినందునే నేడు ఈ స్థాయికి ఎదిగానని అని నరేష్ చెప్పాడు. 

నరేష్ అతని తల్లితండ్రులు పడిన కష్టాలు, అతని కృషి, లక్ష్యం సాధించాలనే పట్టుదల, ఈ విజయగాధ ఎందరికో స్పూర్తిదాయకం. పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకొనేందుకు పేదరికం, కష్టాలు, సమస్యలు, సవాళ్ళు అవరోధం కావని నరేష్ నిరూపించి చూపాడు. కనుక చిన్న చిన్న కారణాలకే నిరాశనిస్పృహలకు లేదా ఆవేశకావేశాలకు లోనయ్యి ఆత్మహత్యలు చేసుకొనేవారు నరేష్ జీవితం చూసి నేర్చుకోవలసినది చాలా ఉంది.


Related Post