బీజేపిలోకి హార్దిక్ పటేల్... రాహుల్ గాంధీపై విమర్శలు

May 31, 2022


img

గుజరాత్‌లో ఉన్నత వర్గానికి చెందిన పటెల్ సామాజిక వర్గానికి కూడా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పోరాడి వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్, 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఏడాదికే గుజరాత్‌ పీసీసీ అధ్యక్ష పదవి కూడా లభించింది. కానీ బీజేపికి కంచుకోట వంటి గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎన్నటికీ గెలవలేదనే సంగతి కాస్త ఆలస్యంగా గ్రహించారో ఏమో... ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపిలో చేరేందుకు సిద్దమయ్యారు. ఆయన జూన్ 2వ తేదీన బీజేపిలో చేరబోతున్నారు. అయన ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోవడం ఆ పార్టీకి చాలా నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపిన రాజీనామా లేఖలో పార్టీ అధిష్టానం వైఖరిని ఎండగట్టి ఇటువంటి వైఖరి కారణంగానే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని తెలియజేయడం విశేషం. 

ఇంతకీ హార్దిక్ పటేల్ తన రాజీనామా లేఖలో ఏమి వ్రాశారంటే, “పార్టీ క్లిష్టపరిస్థితులలో ఉన్నప్పుడు చెంతనే ఉండాల్సిన మన నాయకుడు విదేశాలలో ఉన్నారు. మన పార్టీ అగ్రనేతలను కలిసినప్పుడు నేను వారికి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చెప్పబోతే వారు ఏమాత్రం ఆసక్తి చూపకుండా తమ అనుచరులకు ఫోన్లు చేసుకుంటూ కాలక్షేపం చేశారు. 

కాంగ్రెస్ అధిష్టానానికి గుజరాత్‌ పట్ల వ్యతిరేకత ఉంది కనుకనే గుజరాత్‌ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దూరంపెడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వెళ్ళేందుకు ఎటువంటి కార్యాచరణ కనిపించదు. అందుకే అన్ని రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. 

అయినా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అలాగే కొనసాగుతోంది. ఈవిధంగా అగమ్యగోచరంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగలేను కనుక పార్టీకి రాజీనామా చేస్తున్నాను,” అని తన మనసులో అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి బీజేపిలోకి వెళ్ళిపోతున్నారు హార్దిక్ పటేల్. 

కొసమెరుపు ఏమిటంటే, అయన గుజరాత్‌లో బీజేపి ప్రభుత్వంతోనే రిజర్వేషన్ల కోసం పోరాడి వెలుగులోకి వచ్చారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులను విమర్శించారు కూడా. ఇప్పుడు అదే బీజేపిలోకి వెళ్లి అదే నోటితో వారిని పొగడబోతున్నారు. 


Related Post