టిఆర్ఎస్ ప్రభుత్వం అందుకే మీటర్లను వ్యతిరేకిస్తోంది: బండి

May 31, 2022


img

తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై సరికొత్త ఆరోపణలు చేశారు. టిఆర్ఎస్‌ పార్టీలో పలువురు నేతలు తమ ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల నుంచి అక్రమంగా విద్యుత్ వాడుకొంటున్నారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ రైతులకు మాత్రమే పరిమితం కావలసి ఉండగా సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌లో బడా బాబులు అందరూ వాడుకొంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెడితే టిఆర్ఎస్‌ నేతల అక్రమ విద్యుత్ వినియోగం అంతా బయటపడుతుందనే టిఆర్ఎస్‌ ఈ ప్రతిపాదనలను గట్టిగా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. అందుకే వారు ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి ఆరోపించారు. 

భద్రాద్రి పవర్ ప్లాంట్ టిఆర్ఎస్‌ నేతల బినామీలతో నడిపిస్తూ కమీషన్లు దండుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బయట బహిరంగ మార్కెట్లో రూ.3లకి లభించే విద్యుత్‌ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 చొప్పున కొనుగోలు చేస్తూ కమీషన్లు దండుకుంటూ రాష్ట్ర ఖజనాకి నష్టం కలిగిస్తోందని ఆరోపించారు.   

మజ్లీస్ పార్టీతో దోస్తీ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం హైద‌రాబాద్‌ పాతబస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని దీని వలన భారీగా నష్టం వస్తోందని ఆరోపించారు. టిఆర్ఎస్‌ స్వార్ధ ప్రయోజనాల కోసం సిఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని బలిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం గురించి టిఆర్ఎస్‌, బీజేపిలు రెండూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని చెప్పక తప్పదు. అదనపు రుణాలు కావాలనుకుంటున్న రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ విషయం టిఆర్ఎస్‌, బీజేపి రెండూ ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతూ ఈవిధంగా రాజకీయాలు చేస్తున్నాయి.   



Related Post