తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నానని స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆ దిశలో ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న బెంగళూరు వెళ్ళి దేవగౌడ, కుమారస్వామిలను కలిసిన తరువాత సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “మరో రెండు మూడు నెలల్లో సంచలన వార్త వినిపిస్తా,” అని చెప్పారు. బహుశః అది కొత్తగా జాతీయ పార్టీ లేదా కూటమితో తన జాతీయ రాజకీయ ప్రవేశం గురించి అయ్యుండవచ్చని భావించవచ్చు.
రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి దానికి వేదిక, ముహూర్తం నిన్న ప్రకటించేశారు. హనుమకొండ జిల్లా ఖాజీపేట పట్టణంలో శుక్రవారం జరిగిన కార్మిక సదస్సులో మాట్లాడుతూ, “ఈ ఏడాది దసరానాడు సిఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అదే రోజున జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తారు,” అని ప్రకటించారు.
ఆలోగా కొత్తగా జాతీయ పార్టీ లేదా కూటమి ఏర్పాటుకు సిఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా పూర్తయి స్పష్టత వస్తుంది. సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్తే మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం ఖాయమనే భావించవచ్చు.
ఇక దసరాకు ముందే కొత్త సచివాలయం కూడా అందుబాటులోకి వస్తుంది. కనుక సిఎం కేసీఆర్ దసరాకు ముందు తన పదవికి రాజీనామా చేసి, కొత్త సచివాలయాన్ని, ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడికి అప్పగించవచ్చు. దసరా రోజున ఉదయం కేటీఆర్ ముఖ్యమంత్రిగా కొత్త సచివాలయంలో ప్రవేశించడం, ఆదేరోజున మధ్యాహ్నం లేదా సాయంత్రం వరంగల్ భద్రకాళి ఆలయంలో కేసీఆర్ అమ్మవారికి పూజలు చేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశించవచ్చు.
కేటీఆర్ ఈ ఏడాది దసరానాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే, పార్టీ పగ్గాలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పదవిలో కేటీఆర్ కుదురుకొంటారు. అప్పుడు కేటీఆర్, హరీష్‌రావుల నేతృత్వంలో టిఆర్ఎస్ ఎన్నికలను సులువుగా ఎదుర్కోగలుగుతుంది.
జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్న సిఎం కేసీఆర్ జాతీయ ఫ్రంట్ లేదా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు సవాళ్ళు విసురుతున్న బిజెపికి అడ్డుకట్టవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.