గత ఏడాది అక్టోబర్ 3న ముంబై సముద్రతీరంలో లంగరువేసిన ఓ క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్బీసీ)అధికారులు ఆకస్మిక దాడి చేసి,ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహ మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ లభించాయని ఎన్బీసీ అధికారులే చెప్పారు.
ఆ తరువాత ఆర్యన్ ఖాన్‌తో సహా మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచడంతో వారికి రెండు వారాల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తరువాత ఈ డ్రగ్స్ కధలో వేగంగా మార్పులు జరగడం మొదలయ్యాయి. ఆర్యన్ ఖాన్, మెహక్ వద్ద కూడా డ్రగ్స్ లభించాయని చెప్పిన విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్ అనే ఇద్దరు అధికారులను ఈ కేసులో నుంచి తప్పించబడ్డారు. దేశంలోనే ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ రంగంలో దిగి ముంబై కోర్టులో చెడుగుడు ఆడేసి ఆర్యన్ ఖాన్, మెహక్‌లకు బెయిల్‌పై సంపాదించి బయటకు తీసుకు వచ్చేశారు.
ఆ తరువాత ఎన్బీసీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో ఆర్యన్ ఖాన్, మెహక్‌తో సహా మరో నలుగురిపై ఎలాంటి నేరారోపణలు చేయలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్లు 6,000 పేజీలతో ఎన్బీసీ నేడు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్‌లో ఆర్యన్ ఖాన్ నేరం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభిచలేదని పేర్కొంటూ ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి కల్పించింది. మిగిలిన 14మందిపై మాత్రం నేరాభియోగాలు మోపింది.
కనుక దీని వలన తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, డ్రగ్స్ కేసులలో ప్రముఖులు, వారి పిల్లలూ పట్టుబడినా వారు నిర్ధోషుల కిందే లెక్క. వారిని పట్టుకొనే ప్రయత్నం చేస్తే ఉద్యోగాలకే ఎసరొస్తుంది. హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కేసు ఓసారి గుర్తుచేసుకొంటే అదీ ఇలాగే ముగిసిందని గ్రహించవచ్చు. కనుక చిన్న చిన్న ముఠాలను పట్టుకొంటూ ఆ వార్తలు న్యూస్ ఛానల్, పేపర్లలో వచ్చేలా చేసుకొంటే చాలు..పేరుకి పేరు, ప్రమోషన్ రెండూ వస్తాయి.