కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని పదేపదే ఆరోపిస్తున్న సిఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అదే విషయం నేరుగా ఆయనకే చెప్పి తన అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. కానీ ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకే ఇష్టపడని కేసీఆర్ ఆయన వచ్చే సమయానికి బెంగళూరు వెళ్ళిపోయి మొహం చాటేశారు.
అయితే సిఎం కేసీఆర్ చెప్పడానికి సాహసించని మాటలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా నిర్భయంగా ప్రధాని నరేంద్రమోడీకి చెప్పడమే కాక తమ రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి సరిగా లేదంటూ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అదీ... తమిళనాడులో రూ.31,000 కోట్లు విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు చెప్పడం ఇంకా విశేషం.
సిఎం కేసీఆర్ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ధైర్యంగా ప్రధాని మోడీకి ఏనాడూ తన అసంతృప్తిని వ్యక్తం చేయలేకపోయారు. కానీ జీవితంలో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన స్టాలిన్, మొట్ట మొదటి కలయికలోనే మోడీకి చెప్పవలసినవన్నీ చెప్పేశారు.
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో గట్టిగా ఒత్తిడి తెస్తుంటామని చెప్పారు. రాష్ట్రానికి రావలసిన నిధులు సకాలంలో విడుదల చేయకుండా కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఇది సరికాదని స్టాలిన్ అన్నారు. జీఎస్టీలో రాష్ట్ర వాటాను తక్షణం విడుదల చేయాలని కోరారు.
తమిళనాడులో నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం కూడా చేశామని కనుక నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దితే సహించబోమని చెప్పారు. హిందీకి బదులు తమిళ భాషను జాతీయ భాషగా ప్రకటించాలని, మద్రాస్ హైకోర్టులో తమిళంను అధికారిక భాషగా మార్చాలని కోరారు. శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి ఆ దేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని భారత్ అధీనంలోకి తీసుకోవాలని తద్వారా తమిళనాడు మత్స్యకారులు స్వేచ్ఛగా చేపలు పట్టుకోగలరని స్టాలిన్ సూచించారు.