హిందుత్వ అజెండాతో పనిచేసే బిజెపి ఏ ఎండకు ఆ గొడుగు పడుతోందా?అంటే అవుననే చెప్పుకోవాలి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో వారిని విమర్శిస్తుంటుంది. అదే...ముస్లిం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటుంది లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, దాని అసమర్ధత నిర్లక్ష్యం కారణంగానే ఆయా రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని మాట్లాడుతుంటుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా తక్కువ కనుక హిందుత్వ అజెండా పనిచేయదు గనుక.
ఈశాన్యంలో అభివృద్ధి గురించి మాట్లాడే బిజెపి తెలంగాణలో దాని గురించి పెద్దగా మాట్లాడదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని కేంద్రప్రభుత్వమే గుర్తించి అవార్డులు ఇస్తోంది కనుక. హిందూ, ముస్లింల గురించి ఎక్కువగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అంటూ ఏదో మాట్లాడుతుంది కానీ రాష్ట్రాభివృద్ధిపై లోతుగా మాట్లాడదు.
తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ కనుక రాష్ట్రంలో హిందుత్వ అజెండాను అమలుచేస్తూ ఎన్నికలలో లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికలలో ఈ హిందుత్వ అజెండాను అమలుచేసి బిజెపి 47 సీట్లు గెలుచుకోగలిగింది. కనుక అదే అజెండాతో ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని తహతహలాడుతోందని చెప్పవచ్చు.
నిన్న కరీంనగర్‌లో ఆ పార్టీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తద్వారా వివిద పార్టీల మద్య చీలిపోయున్న హిందువుల భావోద్వేగాలు రెచ్చగొట్టి గంపగుత్తగా వారి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తుంటుంది.
ఈశాన్యంలో ఒక విదంగా, తెలంగాణలో మరో విదంగా మాట్లాడుతున్న బిజెపి ఏ ఎండకు ఆ గొడుగు పడుతోందని అర్ధమవుతూనే ఉంది. కనుక తెలంగాణలో హిందువులను బిజెపి ఓ ఓటు బ్యాంకుగానే చూస్తోంది తప్ప వారి మీద ప్రేమ కారిపోతోందని చెప్పలేము.