తెలంగాణకు పెట్టుబడులు ప్రవహింపజేస్తున్న కేటీఆర్‌

May 25, 2022


img

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బృందం దావోస్‌ ఆర్ధిక సదస్సులో దుమ్ము రేపుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు రోజుల సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.1,100 కోట్లు పెట్టుబడులు సాధించగా, ఇవాళ్ళ ఒక్కరోజే మరో రూ.1,000 కోట్లు పెట్టుబడితో కలిపి మొత్తం 2,100 కోట్లు పెట్టుబడులు సాధించి తన సత్తా నిరూపించుకొన్నారు. ఇదికాక ప్రపంచ ప్రసిద్ది చెందిన షిండ్లర్ ఎలక్ట్రిక్ కంపెనీ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసిందని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టబోతోందో ఇంకా తెలియవలసి ఉంది.  

ఈ సదస్సుకి ఆతిధ్యం ఇస్తున్న స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన స్టాడ్‌లర్‌ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఆ కంపెనీ ప్రతినిధి ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యి తెలంగాణలో మేధా సంస్థ ఏర్పాటు చేయబోతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి వివరించారు. స్టాడ్‌లర్‌ కంపెనీ కూడా అదే రంగంలో ఉండటంతో, రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టి మేధా సంస్థతో కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. 


మంత్రి కేటీఆర్‌ ఇదే విషయం ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ, “స్టాడ్‌లర్‌ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడితో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. స్టాడ్‌లర్‌ కంపెనీ, మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేయబోయే ఈ కోచ్ ఫ్యాక్టరీలో 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి,” అని స్టాడ్‌లర్‌ కంపెనీ ప్రతినిధి ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో దిగిన ఓ ఫోటోను మంత్రి కేటీఆర్‌ షేర్ చేశారు. 



Related Post