సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని నిర్లక్ష్యానికి గురైనవాటిలో అనేక అపురూపమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో నల్గొండ జిల్లాలోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయం కూడా ఒకటి. ఈ ఆలయం చాలా విధాలుగా ప్రత్యేకమైనది.
ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కందుకూరి చోళరాజులు నిర్మించారు. ఇన్ని శతాబ్ధాలు గడిచినా నేటికీ చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఈ ఆలయాన్ని తెల్లటి రాయితో నిర్మించడంతో చాలా దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంటుంది.
ఇక ఈ ఆలయంలో తప్పక చెప్పుకోవలసిన విషయం గర్భగుడిలో శివలింగం వెనుక ఓ స్తంభం ఆకారంలో ఓ నీడ పడుతుంది. అయితే అది అక్కడ ఏవిదంగా పడుతోందో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. కనుక నేటికీ అదో మహాద్భుతంగానే ఉంది.
భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఒకే ఆలయంలో శివకేశవుల ఆలయాలు ఉంటాయి. ఇక్కడ శివకేశవుల ఆలయాలతో పాటు సూర్యుడి ఆలయం కూడా ఉండటమే మరో ప్రత్యేకత. ఈ ఆలయంలో ముగ్గురు దేవతలకు మూడు గర్భాలయాలు ఉన్నాయి అందుకే ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా ప్రసిద్ధి చెందింది.
సూర్యుడి భార్య పేరు ఛాయాదేవి. ఛాయా అంటే నీడ. ఈ ఆలయంలో శివలింగం వెనుక నీడ పడుతుండటంతో శ్రీ ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి శివలింగాన్ని జల లింగం అని కూడా పిలుస్తుంటారు. తూర్పున సూర్యదేవాలయం, పడమర వైపు శివాలయం, ఉత్తరాన్న విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ఆవరణలో ఓ కోనేరు కూడా ఉంది. ఈ కొనేరును కలుపుతూ ఎటువంటి నీటి కాలువలు లేనప్పటికీ ఏడాది పొడవునా ఎప్పుడూ నిండుగా నీళ్ళు ఉండటం మరో ప్రత్యేకత.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గొప్ప అద్భుతమైనశ్రీ ఛాయా సోమేశ్వరాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా పానగల్లులోనే ఉంది. నల్గొండ పట్టణం నుంచి కేవలం 4 కిమీ, హైదరాబాద్ నుంచి అయితే 104 కిమీ దూరంలో ఉంది. ఉదయం 6-12 గంటల వరకు, మిగిలిన ఆలయాలకు భిన్నంగా మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకే ఆలయం తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు నిత్య పూజలు జరుగుతుంటాయి.
కనుక దేశ విదేశాలలో ఆలయాలను సందర్శించే ముందు మన పెరట్లోనే అంటే నల్గొండలోనే ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శిస్తే ఈ అద్భుతాలు స్వయంగా చూసి తరించవచ్చు.