ప్రధానిని గౌరవించకపోగా అనుచిత వ్యాఖ్యలు ఏల?

May 24, 2022


img

“తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా?తెలంగాణ రాష్ట్రం భారత్‌లో భాగం కాదా?” అంటూ ప్రశ్నించే టిఆర్ఎస్‌ మంత్రులు, ఇప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే “ఎందుకు వస్తున్నారు?ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు?” అంటూ చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. 

అసలు తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర పార్టీల నేతలెవరూ రాకూడదన్నట్లు మాట్లాడటం గమనిస్తే వారి ప్రశ్నలను వారినే తిరిగి అడగాల్సి ఉంటుంది. “తెలంగాణలో పర్యటించడానికి మీ అనుమతి తీసుకోవాలా? తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబులు ఏమైనా మీకు రాసిచ్చేశారా?” అని బిజెపి నేతలు ఘాటుగా ప్రశ్నిస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేల తీరు మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

“పార్టీలు, రాజకీయాలకు అతీతంగా దేశ ప్రధాని ఎవరైనా సరే వారిని గౌరవించి తీరాల్సిందే” అని చెప్పిన సిఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీ నగరానికి వస్తున్నప్పుడు మొహం చాటేస్తుంటే, యధా రాజా తదా ప్రజా అన్నట్లు ఆయన వైఖరికి అనుకూలంగా మంత్రులు కూడా ప్రధాని నరేంద్రమోడీ పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న రంగారెడ్డి జెడ్పీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణకు ఏమి చేశారని ప్రధాని నరేంద్రమోడీకి మేము స్వాగతం పలకాలి?ఆయనను మేమేందుకు గౌరవించాలి? అసలు ఆయన ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు?” అంటూ చాలా అనుచితంగా మాట్లాడారు. 

కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడీని ఈవిదంగా నిందిస్తూ తెలంగాణ ప్రజలలో బిజెపి పట్ల వ్యతిరేకత కల్పించవచ్చని భావిస్తున్నట్లుంది. కానీ దేశ ప్రధానిని గౌరవించని టిఆర్ఎస్‌ పార్టీ అట్లే ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని గ్రహిస్తే మంచిది. 

టిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాజకీయ శతృత్వం ఉంటే అవి వాటి మద్య తేల్చుకోవాలి కానీ రాష్ట్రంలో బిజెపి ఎదుగదలను అడ్డుకొనేందుకు, రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి పట్ల అగౌరవంగా వ్యవహరిస్తూ, ఆయనను ఉద్దేశ్యించి ఈవిదంగా అనుచితంగా మాట్లాడటం వలన చివరికి టిఆర్ఎస్‌ పార్టీయే అన్ని విదాల నష్టపోతుందని గ్రహిస్తే మంచిది. 

ఇదివరకు ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదేవిదంగా వ్యవహరించి, చివరికి ఎటువంటి దుస్థితిలో ఉన్నారో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు బిజెపిని అడ్డుకొనేందుకు ఈవిదంగా వ్యవహరిస్తే కూర్చోన్న చెట్టు కొమ్మను నరుక్కొన్నట్లే అవుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post