రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

May 23, 2022


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కర్నాటక రాష్ట్రంలోని సేడంలో జరిగిన వేమారెడ్డి మల్లమ్మ 600 ఏళ్ల జయంతి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలనాడు కాకతీయ సామ్రాజ్యం వైభవంగా సాగడానికి రెడ్డి రాజులు కారణం కాగా, దాని పతనానికి వెలమ దొరలు కారణమని అన్నారు. రాణీ రుద్రమదేవి హయాంలో రెడ్డిసామంత రాజుల అండదండలతో కాకతీయ సామ్రాజ్యం వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయేవారని కానీ ఆమె తదనంతరం రాజ్యాధికారం చేపట్టిన ప్రతాప రుద్రుడు రెడ్డి రాజులను పక్కనపెట్టి పద్మ నాయక వెలమ దొరలకు ప్రాధాన్యం ఇవ్వడంతో కాకతీయ సామ్రాజ్యం నాశనం అయ్యిందని అన్నారు. చరిత్రలో ఈ వాస్తవాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు.  

ఒకప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని రెడ్డి కులస్థులు వ్యవసాయం చేసేవారని, ఆ క్రమంలో వారు సమాజంలో అట్టడుగు ప్రజానీకంతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని అన్నారు. రెడ్డి కులస్థులు పేద ప్రజల ఆకలి తీర్చగలిగినంత కాలం రాజకీయంగా బలంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే వ్యవసాయానికి దూరం అయ్యారో అప్పటి నుంచి అట్టడుగు ప్రజానీకంతో సంబందాలు కోల్పోయి రాజకీయంగా బలహీనపడ్డారని రేవంత్‌ రెడ్డి అన్నారు. రెడ్డి కులస్థులు రాజకీయంగా ఎంత ఎదిగినప్పటికీ ఎక్కువ కాలం నిలద్రొక్కుకోలేకపోవడానికి ఇదీ ఓ కారణమని అన్నారు. 

కనుక ప్రతీ రెడ్డి పేరు పక్కన ఓ 5 లేదా 10 ఎకరాల వ్యవసాయ భూమి తప్పనిసరిగా ఉండాలని అప్పుడే వారు రాజకీయాలలో కూడా రాణించగలుగుతారని రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెడ్డి కులస్తులు ఎవరివైపు ఉంటారో వారికే అధికారం లభిస్తుందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో నాటికీ నేటికీ రెడ్డి కులస్తులకే ప్రాధాన్యత, పదవులు, అధికారం లభిస్తుంటాయి. ఆ కారణంగానే సమైక్య రాష్ట్రాన్ని పాలించినవారిలో ఎక్కువగా రెడ్డి కులస్థులే ఉన్నారు. జనాభా పరంగా వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను వారే శాశించేవారని అందరికీ తెలుసు. నేటికీ ఏపీలో రెడ్లే పరిపాలిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

రేవంత్‌ రెడ్డి తెలంగాణలో రెడ్డి కులస్తులను ఆకట్టుకోవడానికి చేసిన ఈ వ్యాఖ్యలు మిగిలిన వర్గాలు ముఖ్యంగా వెలమలు కాంగ్రెస్ పార్టీకి దూరం చేయవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి చెప్పిన దానిలో ఓ వాస్తవం కూడా కనిపిస్తోంది. రెడ్లు వ్యవసాయంతో, బడుగు బలహీన వర్గాలతో అనుబందం కలిగి ఉంటే ఆయా వర్గాల ప్రజలు వారి వెన్నంటి ఉండవచ్చు. 


Related Post