ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు. ఆయన రాక మునుపే సిఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి, ప్రధాని తిరిగి వెళ్ళిపోయిన మర్నాడు అంటే మే 27న హైదరాబాద్ తిరిగివస్తారు. సాధారణంగా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే, ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర, గవర్నర్, ముఖ్యమంత్రి, డిజిపి, సీఎస్ తదితర ఉన్నతాధికారులు విమానాశ్రయంలో స్వాగతం చెప్పాలి. కానీ గత కొన్ని నెలలుగా సిఎం కేసీఆర్ కేంద్రంపై కత్తులు దూస్తుండటంతో, ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినా వెళ్ళి కలవకుండా తప్పించుకొంటున్నారు.
ఫిభ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు సిఎం కేసీఆర్ జ్వరం వచ్చిందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించారు. ఈసారి రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి ప్రధాని నరేంద్రమోడీకి ఎదురు పడకుండా తప్పించుకొంటున్నారు.
అంటే ప్రధాని నరేంద్రమోడీని సిఎం కేసీఆర్ కలవకూడదని నిర్ణయించుకొన్నట్లు భావించవచ్చు. ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు సిఎం కేసీఆర్ ఆయనను కలిసేందుకు ఇష్టపడకపోతే, రేపు ఏదైనా అవసరం పడి ఢిల్లీ వెళ్ళి ఆయనను ఏవిదంగా కలవగలరు?అప్పుడు ఆయన కూడా సిఎం కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించవచ్చు కదా?
గతంలో సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో భేటీ అవుతుండటం, పార్లమెంటులో కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని గట్టిగా సమర్ధించుకొన్నారు. టిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ విభేధాలున్నప్పటికీ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య చక్కటి అవగాహన, సంబంధాలు చాలా అవసరమని సమర్ధించుకొన్నారు. కానీ ఇప్పుడు ఆ మాటలు మరిచిపోయినట్లు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తే సిఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు. ఈవిదంగా వ్యవహరించడం వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత నష్టం జరగవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.